Let's talk: editor@tmv.in
ఢిల్లీ–గౌహతి మధ్య అమెజాన్ తొలి ఎయిర్ కార్గో సేవలు ప్రారంభం

ఢిల్లీ–గౌహతి మధ్య అమెజాన్ తొలి ఎయిర్ కార్గో సేవలు ప్రారంభం

Dantu Vijaya Lakshmi Prasanna
14 మార్చి, 2026

ఢిల్లీ నుంచి గౌహతి వరకు ప్రత్యేక అమెజాన్ ఎయిర్ కార్గో విమాన సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సేవలు ప్రారంభం కావడం ఈశాన్య భారత రాష్ట్రాలకు ఎయిర్ కార్గో కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. దీని ద్వారా ఈ ప్రాంతంలోని ఉత్పత్తులు వేగంగా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక కార్గో సేవల వల్ల సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గనుంది. ముఖ్యంగా అసోం, ఈశాన్య ప్రాంతంలోని రైతులు, తోటల ఉత్పత్తుల సాగుదారులు, కళాకారులు, చిన్న వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు పంపే అవకాశం పొందనున్నారు. త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తులు కూడా తక్కువ సమయంలో పెద్ద మార్కెట్లకు చేరుకోవడంతో వారికి మంచి ధరలు లభించే అవకాశముందని అధికారులు తెలిపారు.

గౌహతికి అమెజాన్ ఎయిర్ కార్గో సేవలు ప్రారంభం కావడం అసోం రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నదానికి నిదర్శనమని, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, కొత్త పారిశ్రామిక అవకాశాలు ఏర్పడుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. .

ఈ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన “యాక్ట్ ఈస్ట్” విధానంకు అనుగుణంగా జరుగుతోందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలను దేశ ఆర్థిక వ్యవస్థతో మరింత బలంగా అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో ఈశాన్య ప్రాంతంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. 2014లో ఈ ప్రాంతంలో కేవలం 9 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 16కి పెరిగింది. దీంతో ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడి ప్రయాణికులతో పాటు సరుకు రవాణాకు కూడా అనుకూల వాతావరణం ఏర్పడింది.

అదే సమయంలో స్థానికంగా ఉత్పత్తి అయ్యే తోటల ఉత్పత్తులు, హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు, త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తులు విస్తృత మార్కెట్లకు చేరుకునేలా ఎయిర్ కార్గో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఈ చర్యల ద్వారా “ఓకల్ ఫర్ లోకల్ ” దార్శనికతను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు.

ఢిల్లీ–గౌహతి మధ్య అమెజాన్ తొలి ఎయిర్ కార్గో సేవలు ప్రారంభం - Tholi Paluku