Let's talk: editor@tmv.in
ఢిల్లీ వర్సిటీ నుంచే నా ప్రస్థానం మొదలు

ఢిల్లీ వర్సిటీ నుంచే నా ప్రస్థానం మొదలు

Pinjari Chand
25 సెప్టెంబర్, 2025

ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్​ ఎలక్షన్ల లో గెలుపొందిన ‘డూసూ’ విద్యార్థి నాయకులు బుధవారం ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ఆమె క్యాంప్​ ఆఫీస్​ అయిన జన్​ సేవా సదన్​ లో కలిశారు. ఈ సందర్బంగా ఆఫీస్​ బేరర్లుగా ఎన్నికైన వారిని అభినందించారు. సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం సాధించడం సంప్రదాయానికి, పోరాటానికి ప్రతీక అని ఆమె తెలిపారు. కొన్ని దశాబ్దాల క్రితం జ్ఙానం, శీలం,ఏకత అనే నినాదాలతో ఏర్పడిందని సీఎం గుర్తు చేశారు. వీరు విజయం సాధించడం నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని, నేను కూడా ఢిల్లీ యూనివర్సిటీ లో చదివేటప్పుడు ఎన్నికల్లో గెలిచానని, అక్కడే నుంచే నా రాజకీయ ప్రయాణం మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఆ దశలో ఏర్పడిన అంకితభావం, దేశ సేవ భావాలు ఇప్పటికీ ఉన్నాయని, అదే ప్రేరణతో ప్రస్తుతం కూడా పని చేస్తున్నామన్నారు.

డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ మూడు పదవులను గెలుచుకుంది. అధ్యక్షుడిగా ​ ఆర్యన్ మాన్ 28,821 ఓట్లతో అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు, కునాల్​ చౌదరి 23,779 ఓట్లతో కార్యదర్శి పదవిని గెలుచుకున్నారు, జాయింట్ సెక్రటరీగా దీపికా ఝా 21,825 ఓట్లతో గెలిచారు. వీరిని కలవడం చాలా ఉత్సాహంగా ఉందని సీఎం రేఖా గుప్తా ‘ఎక్స్​’ లో పోస్ట్​ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగల నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ యూఐ) ఉపాధ్యక్ష స్థానాన్ని గెలుచుకుంది. ఈ సందర్బంగా సీఎం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఢిల్లీ వర్సిటీ నుంచే నా ప్రస్థానం మొదలు - Tholi Paluku