
డ్వాక్రా ఉత్పత్తులకు ‘స్వయం’ బ్రాండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగు వేశారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ‘స్వయం’ అనే బ్రాండ్ పేరును ఆయన ఖరారు చేశారు. బుధవారం సచివాలయంలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ పేరును ఖరారు చేస్తూ మహిళలు స్వయం శక్తితో అభివృద్ధి చెందుతున్న తీరుకు ఈ పేరు అద్దం పడుతుందని సీఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మార్కెటింగ్ కోసం సిద్ధం చేసిన రెండు లోగోలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అయితే లోగో ఎంపికలో మహిళల భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షిస్తూ క్షేత్రస్థాయిలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగానే తుది లోగోను ఖరారు చేయాలని స్పష్టం చేశారు. లోగో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా బ్రాండ్ యొక్క విశిష్టతను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు.
డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు నాణ్యత పరంగా తిరుగులేదని అయితే సరైన బ్రాండింగ్, మార్కెటింగ్ లేకపోవడం వల్ల ఆశించిన మేర ఆదాయం రావడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదేవిదంగా స్థానిక మార్కెట్లకే పరిమితం కాకుండా, గ్లోబల్ మార్కెట్‌ను ఆకర్షించేలా వ్యూహాలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ బ్రాండింగ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల ఆదాయం పెరగడమే కాకుండా ఆర్థికాభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు అవుతారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
