

డ్రోన్ల సాయంతో 1,000 ఎకరాల్లో సీడ్ బాల్స్ వెదజల్లింపు
రాష్ట్రంలో క్షీణించిన అడవుల పునరుద్ధరణకు సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వర్షపాతం, నేలలో తేమ వంటి వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. అడవుల్లో మానవ వనరులు చేరుకోలేని లోయలు, దుర్భేద్య ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగాన్ని మరింత విస్తరించాలని ఆయన స్పష్టం చేశారు.
శనివారం అటవీశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాల వారీగా సీడ్ బాల్స్ పంపిణీ, డ్రోన్ల వినియోగం, ఇప్పటివరకు సాధించిన పురోగతి, తదుపరి లక్ష్యాలపై పవన్ కళ్యాణ్ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్ సిద్ధం చేయగా, వాటిలో 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్‌ను దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లారు. ఇందులో సుమారు 6 వేల హెక్టార్లలో మానవ వనరుల సహాయంతో 59 లక్షల సీడ్ బాల్స్ పంపిణీ పూర్తయిందన్నారు. తొలిసారిగా డ్రోన్ల సాయంతో సుమారు వెయ్యి ఎకరాల్లో సీడ్ బాల్స్ జారవిడిచి, మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో అటవీ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.
రాజమహేంద్రవరం అటవీ సర్కిల్‌లో అత్యధికంగా 28 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లగా, అందులో 2.26 లక్షలను డ్రోన్ల ద్వారా పంపిణీ చేశారు. విశాఖ అటవీ డివిజన్‌లో 7.50 లక్షలు, కర్నూలు ప్రాంతంలో 8.67 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చింతూరు, పీటీ ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం, వైఎస్ఆర్ కడప అటవీ డివిజన్లలో వాతావరణ పరిస్థితులను అనుసరించి డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ, వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ఆలస్యం చేయకుండా సీడ్ బాల్స్ వెదజల్లాలని సూచించారు. అవసరమైతే డ్రోన్ల సంఖ్యను పెంచాలని, 30 వేల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీడ్ బాల్స్ వెదజల్లడమే కాకుండా, మొలకెత్తిన మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా అటవీశాఖ స్వీకరించాలని, తద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
