
డ్రైవర్ కొడుకు నుంచి టీవీకే అభ్యర్థి వరకు.. వైరల్ వీడియో వెనుక కథ
నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నిర్వహించిన అభ్యర్థుల ప్రకటన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఒక భావోద్వేగ క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో టీవీకే అభ్యర్థి ఆర్. శబరినాథన్ కన్నీళ్లు పెట్టుకోగా, విజయ్ స్వయంగా అతని కన్నీళ్లు తుడిచి ఆలింగనం చేసుకోవడం కనిపించింది. 30 ఏళ్ల శబరినాథన్ టీవీకే తరఫున విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తమిళ వెట్రి కజగం అధినేత విజయ్‌కు చాలాకాలం డ్రైవర్‌గా, తర్వాత వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడే శబరినాథన్. ఈ సంఘటనతో శబరినాథన్ కథ ఒక్కరాత్రిలోనే ప్రజల్లో చర్చనీయాంశమైంది. సాధారణ కుటుంబం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తన ప్రయాణానికి ఇది అద్భుతమైన ఆరంభమని ఆయన తెలిపారు.
శబరినాథన్ కథలో ఆసక్తికర మలుపు ఉంది. అతని తండ్రి రాజేంద్రన్ తన కుమారుడు ఇంజనీర్ కావాలని ఆశపడ్డారు. అందుకోసం అప్పులు చేసి మరీ చదివించారు. 2021లో శబరినాథన్ ఖతార్‌లో ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే ఆ ఉద్యోగం చేసినప్పటికీ అతనికి తృప్తి కలగలేదని చెప్పారు. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారని తెలుసుకున్న తర్వాత చెన్నైకి తిరిగి వచ్చి ఆ ప్రయాణంలో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే తండ్రి దీనికి మొదట ఒప్పుకోలేదని శబరినాథన్ తెలిపారు. చివరకు విజయ్ స్వయంగా రాజేంద్రన్‌తో మాట్లాడి తనను పార్టీలో చేరేందుకు అనుమతించారని చెప్పారు. దీంతో శబరినాథన్ 2024లో చెన్నైకి తిరిగి వచ్చి టీవీకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. పార్టీ పనుల్లో అతని ఉత్సాహాన్ని చూసిన విజయ్ అతనికి విరుగంబాక్కం జిల్లా కార్యదర్శి బాధ్యతలు అప్పగించగా, ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.
నా చిన్నప్పటి నుంచి విజయ్‌ను చూస్తున్నాను
శబరినాథన్ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి విజయ్‌ను దగ్గరగా చూసిన అనుభవం ఉందని తెలిపారు. తన తండ్రితో కలిసి అనేకసార్లు షూటింగ్ స్థలాలకు వెళ్లేవాడినని చెప్పారు. అందువల్ల ఆయనపై అభిమానంతో పాటు నమ్మకం కూడా ఉందన్నారు. విరుగంబాక్కం ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే గుర్తించామని చెప్పారు. అక్కడ ఉన్న 22 ముఖ్య సమస్యలను పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఉదాహరణకు, అక్కడ ఉన్న మద్యం దుకాణాలు ఉదయం 6 గంటలకే తెరవడం స్థానికులకు ఇబ్బంది కలిగిస్తోందని, ప్రభుత్వ సమయాల ప్రకారం నిర్వహణ జరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తాను పెరిగిన ప్రాంతమే విరుగంబాక్కం కావడంతో అక్కడి సమస్యలు బాగా తెలుసని చెప్పారు. మెట్రో కనెక్టివిటీ ఉన్నప్పటికీ చివరి మైలు రవాణా సౌకర్యాలు లేకపోవడం పెద్ద సమస్యగా ఉందని పేర్కొన్నారు. టీవీకే కుటుంబంలో భాగం కావడం తన జీవితంలో గొప్ప విజయమని శబరినాథన్ తెలిపారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయడం పెద్ద బాధ్యత అని, ఇప్పుడు ప్రజల కోసం తన వంతు కృషి చేయాలని సంకల్పించుకున్నానని చెప్పారు.
