
డ్రైవర్ ఉద్యోగం వదిలేశాడని దళితుడిపై దారుణం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మానవత్వాన్ని మింగేసిన భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక దళిత యువకుడిని అతని మాజీ యజమాని అతని ఇద్దరు సహచరులు కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, అవమానకరంగా మూత్రం తాగమని బలవంతపెట్టారు. కాగా ఘటన భింద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం బాధితుడు ఒకరికి డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇటీవల ఆ ఉద్యోగం వదిలేయడంతో ఆ యజమాని కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు బాధితుడిని గ్వాలియర్ నగరంలోని దిందయాళ్ నగర్ ప్రాంతం నుంచి అపహరించి, వాహనంలో భింద్ జిల్లా వైపు తీసుకెళ్లారు. వాహనం రానియా ప్రాంతం సమీపంలోని ఒక వీధిలోకి చేరగానే, నిందితులు బాధితుడిపై ప్లాస్టిక్ పైపులతో దాడి చేసి, బాటిల్‌లో ఉన్న మూత్రం తాగమని బలవంతం చేయడమే కాకా తర్వాత అతనిని అకుట్‌పురా గ్రామంకు తీసుకువెళ్లి, ఇనుప గొలుసుతో కట్టేసి, మరల అదే విధంగా అవమానించారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. పోలీసులు బాధితుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకుని ప్రధాన నిందితుదిన సోను బరువా,అతని తోడల్లుళ్లు అలోక్ శర్మ, చోటు ఓజాలను గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అఘాత నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహితలోని కిడ్నాప్, దాడి, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన విభాగాల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి
గత కొద్ది నెలలుగా మధ్యప్రదేశ్‌లో దళితులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి.
• ఇటీవల కట్నీ జిల్లాలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన దళిత యువకుడిని కొట్టి, అతనిపై మూత్రవిసర్జన చేసిన ఘటన చర్చనీయాంశమైంది.
• మే నెలలో గునా జిల్లా యువకుడిని కిడ్నాప్ చేసి రాజస్థాన్‌కు తీసుకెళ్లి, అమానుషంగా ప్రవర్తించిన ఘటన నమోదైంది.
• మార్చిలో ఉజ్జయినిలో ఓ యువకుడిని కొట్టి, షూల మాలలతో అలంకరించి, మూత్రం తాగమని బలవంతం చేశారు.
• గత సంవత్సరం సిధి జిల్లాలో గిరిజనుడిపై మూత్రవిసర్జన వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది.
మానవ హక్కుల సంఘాల డిమాండ్
ఈ తరహా దాడులు సమాజంలో అసహనాన్ని పెంచుతున్నాయని దళితుల భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితుడికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని వారు కోరారు.
