Let's talk: editor@tmv.in
డ్రగ్స్‌ స్మగ్లర్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం: జమ్మూ ఎల్‌జీ

డ్రగ్స్‌ స్మగ్లర్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం: జమ్మూ ఎల్‌జీ

Pinjari Chand
12 ఏప్రిల్, 2026

మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మూ–కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌ సిన్హా హెచ్చరించారు. స్మగ్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, ఆధార్ వంటి కీలక పత్రాలను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జమ్మూలోని ఎంఏ స్టేడియం నుంచి పరేడ్‌ గ్రౌండ్‌ వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని ఆయన మాట్లాడారు. జమ్మూ–కాశ్మీర్‌ను మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా మార్చేందుకు 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు

పొరుగు దేశాల నుంచి జరుగుతున్న సరిహద్దు దాటి మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు చట్టం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మనోజ్ సిన్హా అన్నారు. స్మగ్లర్ల నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పారు.

ఆస్తుల స్వాధీనం, ఖాతాల ఫ్రీజ్

డ్రగ్ స్మగ్లింగ్‌లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘వారి చర, స్థిర ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తారు. పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఆధార్‌, ఆయుధ అనుమతులు రద్దు చేస్తారు. ఈ చర్యలు ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద అమలు చేస్తార’ని తెలిపారు.

ప్రజల సహకారం అవసరం

మాదకద్రవ్యాల సమస్య జమ్మూ–కాశ్మీర్‌కు అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పంచాయతీలు, మొహల్లా కమిటీలు, చౌకీదార్లు, వార్డ్ కమిటీలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ‘నషా ముక్త్‌ అభియాన్‌’ను ప్రజల ఉద్యమంగా మార్చాలని, అందరి భాగస్వామ్యంతోనే మాదకద్రవ్యాల సమస్యపై విజయం సాధించగలమని ఆయన పిలుపునిచ్చారు.