Let's talk: editor@tmv.in
డ్రగ్స్ వద్దు.. క్రీడలే ముద్దు: కలెక్టర్‌‌ వెంకటేశ్వర్‌‌

డ్రగ్స్ వద్దు.. క్రీడలే ముద్దు: కలెక్టర్‌‌ వెంకటేశ్వర్‌‌

Pinjari Chand
29 ఆగస్టు, 2026

క్రీడల ద్వారా గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే అమరావతి ఛాంపియన్‌షిప్ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలోని తారకరామా స్టేడియం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ‘డ్ర గ్స్ వద్దోయ్ బ్రో.. డ్రగ్స్ వద్దు–క్రీడలు ముద్దు’ నినాదాలతో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. శాప్ ఎండీ భరణి, అదనపు ఎస్పీలు, హాకీ క్రీడాకారిణి రజనీ, అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడాకారులు, విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

15 వేల మందితో క్రీడా పోటీలు

గత నాలుగు రోజులుగా 12 క్రీడా విభాగాల్లో అండర్‌-17, అండర్‌-23 విభాగాల క్రీడాకారులకు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తిరుపతికి తీసుకొచ్చి రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. శాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో సుమారు 15 వేల మంది క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారని చెప్పారు. క్రీడాకారులకు మెరుగైన బస, భోజన వసతులు కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, గాయాలు చోటుచేసుకోకుండా సురక్షితమైన వాతావరణంలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

డ్రగ్స్‌కు దూరంగా.. క్రీడల వైపు

యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా క్రీడలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అండర్‌-17, అండర్‌-23 క్రీడాకారులు తమ తోటి విద్యార్థులు, యువతలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, శాప్ ఆధ్వర్యంలో ‘డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్’ నినాదాలతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.

ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న తిరుపతిలో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. అమరావతి ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు.

క్రీడాకారుల పాత్ర కీలకం: శాప్ చైర్మన్

అమరావతి ఛాంపియన్‌షిప్‌లో నాలుగు రోజుల పాటు ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీలో పాల్గొనడం అభినందనీయమని శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌కు ప్రతీకలుగా యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

12 వేల మందికి గంజాయి పరీక్షలు

యువత మత్తుపదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సూచించారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మత్తుపదార్థాల వినియోగం, విక్రయం లేదా సంబంధిత సమాచారం ఉంటే 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. గంజాయి నియంత్రణ కోసం ప్రత్యేక మొబైల్ యూనిట్‌ను ఏర్పాటు చేసి విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి గంజాయి ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా, 445 మందిని పాజిటివ్‌గా గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. పాజిటివ్‌గా గుర్తించిన వారికి కేసులు నమోదు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

డ్రగ్స్ వద్దు.. క్రీడలే ముద్దు: కలెక్టర్‌‌ వెంకటేశ్వర్‌‌ - Tholi Paluku