Let's talk: editor@tmv.in
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్

Gaddamidi Naveen
13 జులై, 2026

పెనుకొండ నియోజకవర్గంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం, యువతలో అవగాహన పెంచడం లక్ష్యంగా మాజీ మంత్రి, సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో సోమందేపల్లి మండల కేంద్రంలో ‘సే నో టు డ్రగ్స్–సేవ్ యూత్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ దంపతులు నియోజకవర్గానికి చెందిన యువతతో కలిసి 2కే రన్‌లో పాల్గొన్నారు.

‘డ్రగ్స్‌కు నో.. జీవితానికి యస్’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరై మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ అనంతరం మాట్లాడిన ఉషశ్రీ చరణ్, రాష్ట్రాభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అని పేర్కొన్నారు. అలాంటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం బాధాకరమన్నారు.

యువకులు విద్య, కృషి, క్రమశిక్షణతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల అలవాటు వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలకు, సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్‌కు బానిసైతే తల్లిదండ్రుల ఆశలు, యువత కలలు, భవిష్యత్తు చీకటిలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

డ్రగ్స్ రహిత, సురక్షిత పెనుకొండ నిర్మాణమే తమ లక్ష్యమని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. ప్రతి యువకుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సమాజం మొత్తం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
UshaSriCharanPenukondaSayNoToDrugsSaveYouthDrugFreeSocietyDrugFreeIndiaYouthAwarenessAntiDrugsCampaignYSRCPAndhraPradesh
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ - Tholi Paluku