Let's talk: editor@tmv.in
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Gaddamidi Naveen
21 ఫిబ్రవరి, 2026

మాదకద్రవ్యాల మహమ్మారిని రాష్ట్ర సరిహద్దుల వరకూ తరిమికొట్టి, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీలు, క్యాలెండర్లను ఆయన శుక్ర‌వారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ వల్ల కలుగుతున్న సామాజిక అనర్థాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల బారిన పడి యువత భవిష్యత్తు చీకటిలో కలిసిపోతోందని, అనేక కుటుంబాలు దెబ్బతింటున్నాయని అన్నారు. తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయని పేర్కొంటూ, ఇలాంటి అరాచక శక్తులను సమాజం నుంచి పూర్తిగా ఏరిపారేయాల్సిన అవసరం ఉందని ఆయ‌న అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణే మన లక్ష్యం కావాలి. అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని మంత్రి వెల్లడించారు.

అక్రమ మద్యం నియంత్రణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. ఈ పోరాటంలో ప్రభుత్వం అధికారుల వెంటే ఉంటుందని, అవసరమైన వనరులు సమకూర్చడంలో ఎలాంటి వెనుకంజ వేయబోదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని, యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయ‌న‌ చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిందని గుర్తుచేశారు. సౌమ్య త్యాగం పోలీసు వ్యవస్థకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ, ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సురేష్ రాథోడ్, జాయింట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) జి. అంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు - Tholi Paluku