Let's talk: editor@tmv.in
డ్రగ్స్ పడవలపై అమెరికా సైన్యం దాడులు.. 14 మంది మృతి

డ్రగ్స్ పడవలపై అమెరికా సైన్యం దాడులు.. 14 మంది మృతి

Shaik Mohammad Shaffee
30 అక్టోబర్, 2025

మాదకద్రవ్యాల స్మగ్లర్లపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపింది. తూర్పు పసిఫిక్ మహాసముద్ర జలాల్లో మాదకద్రవ్యాలను తరలిస్తున్నాయన్న అనుమానంతో ఉన్న పడవలపై అమెరికా సైన్యం మరోసారి భారీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో మొత్తం 14 మంది మరణించగా, ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అమెరికా అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఒకే రోజు మూడు దాడులు

మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ను అరికట్టే ఆపరేషన్‌లో భాగంగా ఒకే రోజు మూడు వేర్వేరు దాడులు జరపడం ఇదే ప్రథమమని పీట్ హేగ్సేత్ తెలిపారు. తాజా దాడుల్లో నాలుగు మాదకద్రవ్య స్మగ్లింగ్ పడవలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం ప్రకారం, సోమవారం జరిగిన మూడు వేర్వేరు దాడుల్లో, ఒక దాడి ఏకంగా ఒకేసారి రెండు పడవలను లక్ష్యంగా చేసుకుంది. ట్రంప్ పరిపాలనలో ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో, డ్రగ్ రవాణాకు పాల్పడినట్లు అనుమానం ఉన్న నౌకలపై వేగంగా దాడులు కొనసాగుతున్నాయని హేగ్సేత్ పేర్కొన్నారు. తాజా దాడులకు సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. "దాడులన్నీ అంతర్జాతీయ జలాల్లో జరిగాయి. ఈ ఘటనలో అమెరికా దళాలకు ఎటువంటి హానీ జరగలేదు" అని హేగ్సేత్ స్పష్టం చేశారు.

దాడుల అనంతరం ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, రక్షణ చర్యల సమన్వయ బాధ్యతను మెక్సికన్ సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు స్వీకరించారు. మెక్సికో అధికారులు అతడిని రక్షించినట్లు హేగ్సేత్ తెలిపారు. అయితే రక్షించబడిన ఆ వ్యక్తిని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్న విషయంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదని చెప్పారు.

ఈ ఆపరేషన్ గురించి మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ మాట్లాడుతూ, “ఈ ఘటనలు అంతర్జాతీయ జలాల్లో జరిగాయి. అమెరికా ఆపరేషన్, ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గురించి మాకు సమాచారం అందింది” అని చెప్పారు. ఆమె విదేశాంగ మంత్రి జువాన్ రామోన్ డే లా ఫ్యుయెంటేను అమెరికా రాయబారి రాన్ జాన్సన్, మెక్సికో నేవీ కార్యదర్శితో సమన్వయం చేయాలని ఆదేశించారు.

విస్తరిస్తున్న యాంటీ-డ్రగ్ ఆపరేషన్ పరిధి

ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఈ యాంటీ-డ్రగ్ ఆపరేషన్ పరిధిని కరేబియన్ సముద్రం నుండి తూర్పు పసిఫిక్ వరకు విస్తరించింది. తాజా దాడులతో సెప్టెంబర్ ప్రారంభం నుండి డ్రగ్ స్మగ్లింగ్ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం చేపట్టిన మొత్తం ఆపరేషన్ల సంఖ్య 13కు చేరింది. ఈ ఆపరేషన్లలో ఇప్పటివరకు 14 నౌకలు ధ్వంసమయ్యాయి. మొత్తం 57 మంది మృతి చెందా. ఇప్పటివరకు ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలతో బయటపడిన గత కేసుల గురించి కూడా సమాచారం ఉంది. ఈ నెల ప్రారంభంలో కరేబియన్ సముద్రంలో జరిగిన ఇలాంటి దాడిలో ప్రాణాలతో బయటపడిన ఇద్దరిని అమెరికా నేవీ కొద్దికాలం పాటు నిర్బంధించి, ఆ తర్వాత వారిని ఈక్వెడార్, కొలంబియాలకు తిరిగి పంపింది.

డ్రగ్స్ పడవలపై అమెరికా సైన్యం దాడులు.. 14 మంది మృతి - Tholi Paluku