
డ్రగ్స్‌పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం.. ఏడాదిలో రూ.22.17 కోట్ల మత్తు పదార్థాల స్వాధీనం
నగరంలో నిషేధిత డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. లా అండ్ ఆర్డర్, నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సమన్వయంతో క్షేత్రస్థాయి నిఘాను పటిష్టం చేస్తూ త్రైపాక్షిక కార్యాచరణను అమలు చేస్తోంది. దీని ఫలితంగా జూన్ 2025 నుంచి ఈ ఏడాది జూన్ వరకు నగరవ్యాప్తంగా 563 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ దాడులలో ముఠాల గుట్టు రట్టు చేస్తూ రూ. 22.17 కోట్ల విలువైన వివిధ రకాల మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జోన్ల వారీగా నమోదైన కేసులు
నమోదైన మొత్తం 563 కేసులలో అత్యధికంగా జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో 116 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వరుసగా సికింద్రాబాద్ (99), గోల్కొండ (95), చార్మినార్ (90), రాజేంద్రనగర్ (84), ఖైరతాబాద్ (49), శంషాబాద్ జోన్ పరిధిలో 30 కేసుల చొప్పున నమోదయ్యాయని పేర్కొన్నారు.
స్వాధీనం చేసుకున్న రూ. 22.17 కోట్ల విలువైన డ్రగ్స్‌లో అత్యధిక భాగం గంజాయిదే కావడం విశేషం. పోలీసులు రూ. 12.56 కోట్ల విలువైన 2,513 కిలోల గంజాయితో పాటు, రూ. 6.91 కోట్ల విలువైన 55.3 లీటర్ల హ్యాష్ ఆయిల్, రూ. 1.62 కోట్ల విలువైన 1626 గ్రాముల ఎండీఎంఏ, రూ. 64.50 లక్షల విలువైన 129 గ్రాముల కొకైన్‌లను జప్తు చేశారు. వీటితో పాటు హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, ఓపియంలను కూడా సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
డ్రగ్స్ స్థావరాల నిర్మూలన కోసం హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగార్ బస్తీలో 1,100 మంది సిబ్బందితో ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరిట భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించి గంజాయి, అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, డీసీపీ హెచ్-న్యూ పర్యవేక్షణలో 1,550 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, 421 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిని కేవలం శిక్షించడానికే పరిమితం కాకుండా, గాంధీ ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి, పునరావాస కేంద్రాల ద్వారా ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పిస్తూ పోలీసులు మానవీయ కోణాన్ని చాటుకున్నారు.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యువత క్షణికావేశంలో ఈ ఊబిలో పడకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ వారిపై నిఘా ఉంచాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని డయల్ 100కు గానీ లేదా హెచ్-న్యూ నంబర్ 8712661601కు గానీ తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
