Let's talk: editor@tmv.in
డౌనింగ్ స్ట్రీట్‌లో మా సంప్రదాయాలే పాటించాం: అక్షతామూర్తి

డౌనింగ్ స్ట్రీట్‌లో మా సంప్రదాయాలే పాటించాం: అక్షతామూర్తి

Pinjari Chand
25 నవంబర్, 2025

బ్రిటన్ తొలి భారత సంతతి ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతామూర్తి డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఉన్నప్పుడు మా భారతీయతను ఎప్పుడూ తక్కువ చేసింది లేదు. దాచలేదు కూడా అని వెల్లడించారు. యూకేలోని భారతీయ భవన్‌ వార్షిక దీపావళి ఫండ్‌ రైజర్‌లో గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా పాల్గొన్న ఆమె 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో గడిపిన జ్ఞాపకాలను మనసారా పంచుకున్నారు. కార్యక్రమానికి అక్షతతోపాటు ఆమె తండ్రి, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, అత్తమామలయిన యష్‌, ఉషా సునక్‌లు కూడా హాజరయ్యారు.

మన సంస్కృతిని చూపడమే నిజమైన ఆత్మవిశ్వాసం

ఎవరి ముందైనా మనం ఏ మాత్రం సంకోచం లేకుండా మన సంస్కృతిని ప్రదర్శించగలగడమే నిజమైన ధైర్యం. ప్రపంచం మొత్తం చూస్తూ ఉండే వేదిక డౌనింగ్‌ స్ట్రీట్‌. అక్కడ మేం మా సంప్రదాయాలను మూటకట్టుకుని వెళ్లలేదు… అలాగే కొనసాగించాం అని అక్షతా చెప్పారు. మొదటిసారిగా 10 నంబర్‌ బ్లాక్‌ డోర్‌ ముందు దీపాలు వెలిగించడం, నెం. 11 వద్ద రంగోళి వేయడం, పై అంతస్తులో రసం వండుకోవడం, ఇవన్నీ మాకెంతో సహజం. మా వారసత్వాన్ని ఎప్పుడూ దాచే ప్రయత్నం చేయలేదని ఆమె చిరునవ్వుతో గుర్తుచేశారు.

లండన్‌లో భారతీయ కళ, సంస్కృతి, భాషలకు ఆనవాలుగా ఉన్న భారతీయ విద్యా భవన్ తమ కుటుంబానికి ఓ ‘ఆత్మీయ నిలయం’ లాంటిదని అక్షతా అభివర్ణించారు. దేశానికి దూరంగా ఉన్నా… మనసు మాత్రం ఎల్లప్పుడూ ఇంటి వైపే లాగుతుందన్నారు. అమ్మ ముద్దు, మన స్వస్థలం వాసన గుర్తుకు చేసే స్థలం భారతీయ భవన్‌ అని ఆమె భావోద్వేగంగా చెప్పారు. తన తల్లి సుధా మూర్తి ప్రోత్సహిస్తున్న ఈ భవన్‌లో, తానూ తన చిన్న కూతురు అనుష్కతో కలిసి కూచిపూడి నేర్చుకుంటున్నట్లు తెలిపింది. ప్రఖ్యాత కళాకారిణి అరుణిమా కుమార్ దగ్గర శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించింది.

750 మంది విద్యార్థులతో కళల నిలయం

భవన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ఎన్‌. నందకుమార్ నేతృత్వంలో ఈ కేంద్రం సంగీతం, నృత్యం, యోగా, భారతీయ భాషలు ఇలా 23 విభాగాల్లో 120కు పైగా తరగతులు నిర్వహిస్తోంది. యూకే అంతటి నుంచి 750 మందికి పైగా విద్యార్థులు కళలను అభ్యసిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

పార్కింగ్‌ పరిమితులు… భవన్‌కు ఇబ్బంది

స్థానిక కౌన్సిల్‌ ఇటీవల అమలు చేసిన పార్కింగ్‌ నిబంధనలపై భవన్‌ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం చైర్మన్‌ సుభాను సక్సేనా మాట్లాడుతూ పార్కింగ్‌ను ఒక్క గంటకు మాత్రమే అనుమతించడం వల్ల విద్యార్థులు, గురువులకు పెద్ద సమస్య. ఇదే కొనసాగితే తరగతులకు రావడమే కష్టమవుతుంది. మార్పు కోసం పిటిషన్‌ చేపట్టామని వివరించారు.

భారత–బ్రిటన్‌ మధ్య వారది భవన్‌

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దోరైస్వామి భవన్‌ భారత–బ్రిటన్‌ సంబంధాలను మరింత దగ్గర చేయగల కీలక సంస్థ. యూకేలోని ప్రతి వర్గాన్ని చేరదీసే దిశగా భవన్‌ ముందుకు సాగాలని సూచించారు. భవన్‌ విద్యార్థులు, గురువులు సంప్రదాయ భారతీయ శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు, కథక్‌, కూచిపూడి, భరతనాట్యం నృత్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

డౌనింగ్ స్ట్రీట్‌లో మా సంప్రదాయాలే పాటించాం: అక్షతామూర్తి - Tholi Paluku