
డోపింగ్ నివారణకు స్వదేశీ కిట్ల తయారీపై పీటీ ఉషా డిమాండ్
భారత అథ్లెట్లకు సంబంధించిన డోపింగ్ పరీక్షల్లో ఆలస్యం, అధిక ఖర్చులు, విదేశీ కంపెనీలపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడానికి దేశంలోనే యాంటీ డోపింగ్ కిట్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా కోరారు. శుక్రవారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆమె, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద ఈ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ప్రస్తుతం భారత్‌లో ఉపయోగించే అధిక నాణ్యత గల డోపింగ్ పరీక్షా కిట్లను ప్రధానంగా స్విట్జర్లాండ్‌కు చెందిన రెండు కంపెనీలు బెర్లింజర్, లాక్‌కాన్ సరఫరా చేస్తున్నాయని వెల్లడించింది. ఒక కిట్ ధర సగటున ₹8,500 నుండి ₹14,000 వరకు ఉండటం, ఒక పరీక్షకు మొత్తం ఖర్చు ₹18,000 దాటటం వంటివి దేశానికి భారీ ఖర్చుగా మారుతున్నాయని పేర్కొంది. అంతేకాకుండా విదేశాల నుంచి రవాణా కారణంగా పరీక్షా ఫలితాల్లో ఎప్పుడూ ఆలస్యం జరుగుతోందని ఆమె చెప్పారు.
భారత్ 2036 ఒలింపిక్ క్రీడల నిర్వహణకు దరఖాస్తు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, దేశీయ డోపింగ్ నియంత్రణ వ్యవస్థను బలపరచడం అత్యంత అవసరమని ఉషా తెలిపారు. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం కిట్లు తాయారు చేయాలి, ప్రత్యేక కోడ్ వ్యవస్థ ఉండాలి, ప్రయాణంలో దెబ్బతినకూడదు వంటి కఠిన ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆమె వివరించారు.
ప్రస్తుతం భారత్‌లో ఒక్కటే ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ గుర్తింపు పొందిన ప్రయోగశాల నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, న్యూఢిల్లీ లో వుంది. దేశంలో రెండో ప్రయోగశాలని ఏర్పాటు చేయాలంటే ₹250 కోట్లు నుండి ₹400 కోట్లు వరకు ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆధునిక మాస్ స్పెక్ట్రోమీటర్లు, ప్రత్యేక భద్రతా పరికరాలు, శాస్త్రవేత్తల శిక్షణ వంటి అంశాల వల్ల ఈ వ్యయం పెరుగుతుందని వారు చెబుతున్నారు.
క్రీడా మంత్రి మంసుఖ్ మాండవియా ఇటీవల రాజ్యసభలో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది 7,751 డోపింగ్ పరీక్షలు చేపట్టాలని నాడా ప్రణాళిక వేసింది. 2023, 2024 సంవత్సరాలతో పోల్చితే ఇది ఎక్కువ. అయినప్పటికీ మన దేశంలో కక్రీడల్లో డోపింగ్ వంటి ఘటనల్లో ప్రపంచంలో ఎప్పుడూ అగ్రస్థానాల్లో కనిపిస్తుండడంతో ఇంకా బలమైన వ్యవస్థ అవసరమని ఉషా భావిస్తోంది.
దేశీయ కిట్ల తయారీ ప్రారంభిస్తే ఖర్చు తగ్గడంతో పాటు పరీక్షలు త్వరగా పూర్తవుతాయని, పారదర్శకత పెరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల శాస్త్రీయ పరిశోధన, కొత్త ఉపాధి అవకాశాలు, భారతీయ స్టార్టప్‌లకు టెక్నాలజీ అభివృద్ధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆమె అన్నారు. అదే సమయంలో యువ అథ్లెట్లలో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కేంద్రాలపై కఠిన పర్యవేక్షణ, యాదృచ్ఛిక పరీక్షలు, ఉల్లంఘనలపై కఠిన చర్యలు కూడా కొనసాగుతున్నాయని ఉషా పేర్కొన్నారు.
ఉషా సూచనను స్వాగతిస్తున్నప్పటికీ అత్యున్నత నాణ్యతను నెరవేర్చగల తయారీ యూనిట్లను మాత్రమే ఈ రంగంలోకి తీసుకురావాలని క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి అభిప్రాయపడ్డారు. చిన్నపాటి లోపం కూడా డోపింగ్ ఫలితాలను అనుమానాస్పదంగా మారుస్తుందని ఆయన తెలిపారు.
క్రీడలను కాపాడటం నియంత్రణ వ్యవస్థ బాధ్యత మాత్రమే కాకుండా దేశ బాధ్యత కూడా అని, ఈ దిశగా ప్రభుత్వం తక్షణమే కాంక్రీటు చర్యలు తీసుకోవాలని పీటీ ఉషా కోరారు.
