
డోపింగ్ కేసులో సీమా పూనియాపై 16 నెలల నిషేధం
భారత అథ్లెటిక్స్‌లో ప్రముఖంగా నిలిచిన డిస్కస్ త్రోయర్, ఆసియన్, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత సీమా అంతిల్ పూనియాపై డోపింగ్ ఉల్లంఘన కేసులో 16 నెలల నిషేధం విధించాలని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్ణయించింది. యాంటీ-డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్ విడుదల చేసిన అధికారిక జాబితా ప్రకారం నవంబర్ 10, 2025 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. 42 ఏళ్ల సీమా పూనియా గతంలో దేశానికి అనేక పతకాలు అందించారు. ఆమె చివరగా 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. అంతకుముందు 2014లో స్వర్ణం, 2018లో కాంస్యం గెలిచి ఆసియా వేదికపై మూడు పతకాలు సాధించారు. ఆమె పేరుపై నాలుగు కామన్వెల్త్ గేమ్స్ పతకాలు ఉన్నాయి. 2023 ఆసియా గేమ్స్‌లో 58.62 మీటర్ల సీజన్ బెస్ట్ త్రో తో కాంస్యం సొంతం చేసుకున్న పూనియా, భారత పతకాల సంఖ్యను 50 దాటేలా ప్రదర్శన చేశారు.
2002లో జమైకా, కింగ్‌స్టన్‌లో జరిగిన వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి అంతర్జాతీయ కెరీర్‌కు ఆమె శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో తొలి ప్రదర్శన ఇచ్చి, 60.64 మీటర్ల త్రో తో 14వ స్థానంలో నిలిచారు. ఆమె వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన, జాతీయ రికార్డు 64.84 మీటర్లు అని అధికారులు గుర్తుచేశారు. నాడా శుక్రవారం అథ్లెటిక్స్ విభాగంలో మరికొంత మందిపై కూడా చర్యలు తీసుకుంది. ఫాస్ట రన్నర్ అథ్లెట్ పూజా యాదవ్‌కు నాలుగేళ్లు, షాట్‌పుట్ క్రీడాకారుడు మంజీత్ కుమార్ మహేతోకు ఆరు సంవత్సరాలు, మిడిల్ డిస్టెన్స్ రన్నర్ నికేష్ ధనరాజ్ రాథోడ్‌పై నాలుగేళ్ల నిషేధం విధించినట్టు పేర్కొంది.
