
డెలివరీ ఉద్యోగాలు గిగ్ వర్క్ కాదు.. ఫ్లెక్సిబుల్ ఉపాధి: స్విగ్గీ సీఈఓ
దేశీయ ఉద్యోగ మార్కెట్‌లో డెలివరీ భాగస్వాముల వ్యవస్థ ఒక శక్తిమంతమైన 'మూడో పిల్లర్'గా అవతరించిందని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ అభివర్ణించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన 'పీటీఐ'తో మాట్లాడుతూ.. ఈ రంగాన్ని కేవలం 'గిగ్ వర్క్' (తాత్కాలిక పని)గా చూడటం కంటే, 'ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్‌మెంట్’ (సౌకర్యవంతమైన ఉపాధి)గా గుర్తించాలని కోరారు.
మూడు రకాల ఉపాధి మార్గాలు
ఉపాధి కల్పనలో మూడు ప్రధాన మార్గాలున్నాయని రోహిత్ కపూర్ వివరించారు. మొదటిది సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఉండే 'అధికారిక ఉద్యోగ రంగం'. రెండోది సొంతంగా వ్యాపారాలు చేసుకునే 'వ్యాపారవేత్తల రంగం'. ఇక మూడోదే ఈ 'డెలివరీ భాగస్వాముల వ్యవస్థ' అని ఆయన పేర్కొన్నారు. కేవలం గత ఏడాది కాలంలోనే సుమారు 25 లక్షల మంది స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌పై పని చేశారంటే ఈ రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇది కేవలం ఒక వర్గానికి పరిమితం కాలేదని.. విద్యార్థులు, అదనపు ఆదాయం కోరుకునే వారు, పార్ట్ టైమ్ పని చేసే వారు ఇలా అందరికీ ఇదొక ఫ్లెక్సిబుల్ వేదికగా మారిందని చెప్పారు. గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న సామాజిక భద్రత కోడ్‌ను ఆయన స్వాగతించారు.
భారత్‌లోనే అపార అవకాశాలు
స్విగ్గీ భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లోకి వెళ్లే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "ప్రస్తుతానికి గ్లోబల్ విస్తరణ ఆలోచన లేదు. భారత్‌లోనే మాకు అపారమైన అవకాశాలు ఉన్నాయి" అని స్పష్టం చేశారు. దేశంలో ఫుడ్ డెలివరీ వినియోగం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా తక్కువని, ఇంకా 85 నుంచి 90 శాతం మంది అసలు ఫుడ్ డెలివరీ యాప్స్‌నే వాడలేదని వెల్లడించారు. ఏటా ఈ రంగం 18-20 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని, రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల తరగతి మార్కెట్లోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏఐతో పారదర్శకత.. డ్రోన్లపై వేచి చూడాల్సిందే
ఫుడ్ డెలివరీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం వల్ల డెలివరీ భాగస్వాముల నుండి రెస్టారెంట్ యజమానుల వరకు అందరికీ ఎంతో మేలు జరుగుతోందని రోహిత్ కపూర్ వివరించారు. ముఖ్యంగా రెస్టారెంట్లకు ఏ వంటకాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి, వినియోగదారుల స్పందన ఎలా ఉందనే అంశాలను విశ్లేషించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుండగా, డెలివరీ భాగస్వాములకు ఏ సమయంలో ఎక్కడ ఎక్కువ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందో ముందే గుర్తించడంలో ఇది తోడ్పడుతోంది. ఇక డ్రోన్ డెలివరీల గురించి ప్రస్తావిస్తూ.. డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ అనేది సాంకేతికత పరంగా సాధ్యమైనప్పటికీ, ప్రస్తుతానికి అది కేవలం ప్రయోగ దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ విధానం అందుబాటులోకి రావాలంటే నిర్వహణ వ్యయం తగ్గడమే కాకుండా, డెలివరీ చిరునామా వద్ద వినియోగదారుడి ఇంటి తలుపు వరకు నేరుగా ఆహారాన్ని చేరవేసే 'లాస్ట్ మైల్' సవాళ్లకు సరైన పరిష్కారాలు లభించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
