
డెన్మార్క్ ప్రధాని పీఠం ఎవరిది?
డెన్మార్క్ పార్లమెంటుకు మంగళవారం జరిగిన ఎన్నికలు అస్పష్ట ఫలితాలను మిగిల్చాయి. ప్రస్తుత ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ లాండ్ వ్యవహారంలో మెట్టె కనబర్చిన ధైర్యసాహసాలు ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా ఆమె నేతృత్వంలోని సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రాట్ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే తన బలాన్ని గణనీయంగా కోల్పోయింది.
మెజారిటీకి దూరంగా ప్రధాన కూటములు
మొత్తం 179 స్థానాలున్న డెన్మార్క్ పార్లమెంటు (ఫోల్కెటింగ్)లో అటు వామపక్ష (రెడ్ బ్లాక్), ఇటు కుడిపక్ష (బ్లూ బ్లాక్) కూటముల్లో దేనికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ లభించలేదు. గతంలో 27.5 శాతంగా ఉన్న సోషల్ డెమోక్రాట్ల ఓట్లు ఈసారి 21.9 శాతానికి పడిపోయాయి. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు, ఉక్రెయిన్ యుద్ధంపై చూపిస్తున్న శ్రద్ధ దేశీయ సమస్యలపై చూపడం లేదన్న అసంతృప్తి ఓటర్లలో స్పష్టంగా కనిపించింది.
కింగ్ మేకర్‌గా మాజీ ప్రధాని
ప్రస్తుత విదేశాంగ మంత్రి, మాజీ ప్రధాని లార్స్ లోక్కే రాస్ముసేన్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు. ఆయన నేతృత్వంలోని మధ్యేవాద 'మోడరేట్' పార్టీ 14 స్థానాలను గెలుచుకుని 'కింగ్ మేకర్' హోదాను దక్కించుకుంది. "మనం ఒకే జాతి.. విడిపోకూడదు.. అందరూ కలిసి రావాలి" అని ఆయన పిలుపునిచ్చారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన లిబరల్ పార్టీ మాత్రం మెట్టె ఫ్రెడరిక్సెన్ నేతృత్వంలోని సోషల్ డెమోక్రాట్లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
దేశీయ సమస్యలే ఫలితాన్ని శాసించాయి
గ్రీన్ లాండ్ విషయంలో అమెరికాతో సాగిన దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని మెట్టె భావించారు. కానీ ఓటర్లు మాత్రం పెరుగుతున్న నిత్యవసర ధరలు, పెన్షన్లు, సంపద పన్ను వంటి రోజువారీ సమస్యలకే ప్రాధాన్యతనిచ్చారు. ఉక్రెయిన్ రక్షణ విషయంలో మెట్టె తీసుకున్న కఠిన నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందినా, దేశీయంగా ఆమెకు ఓట్లు రాల్చలేకపోయాయి.
సంకీర్ణ చర్చల దిశగా..
డెన్మార్క్ ఎన్నికల విధానం ప్రకారం సాధారణంగా సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడతాయి. మెజారిటీ రాకపోవడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి వారాల తరబడి చర్చలు జరగాల్సి ఉంటుంది. "ప్రపంచం అస్థిరంగా ఉంది. డెన్మార్క్‌కు సమర్థవంతమైన ప్రభుత్వం కావాలి. మేము బాధ్యత తీసుకోవడానికి సిద్ధం" అని మెట్టె ఫ్రెడరిక్సెన్ ప్రకటించారు. అయితే కింగ్ మేకర్ రాస్ముసేన్ ఎటువైపు మొగ్గు చూపుతారనే దానిపైనే ఆమె మూడోసారి ప్రధాని అవుతారా లేదా అనేది ఆధారపడి ఉంది.
