Let's talk: editor@tmv.in
డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణ భారతానికి మేలు: బూర నర్సయ్య గౌడ్

డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణ భారతానికి మేలు: బూర నర్సయ్య గౌడ్

Gaddamidi Naveen
9 ఆగస్టు, 2026

ప్రతిపాదిత 'నియోజకవర్గాల పునర్విభజన బిల్లు - 2026' (డీలిమిటేషన్‌) వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు రాజకీయంగా ఎలాంటి నష్టం జరగదని, పైగా పరోక్షంగా ఎంతో మేలు చేకూరుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాల సంఖ్య నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దాదాపు 850కి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. స్థానాల సంఖ్య దామాషా ప్రకారం పెరుగుతున్నందున దక్షిణ భారతదేశంతో సహా ఏ ఒక్క రాష్ట్రం కూడా రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోదని హామీ ఇచ్చారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతి ప్రతిపాదననూ రాజకీయ పార్టీలు గుడ్డిగా వ్యతిరేకించవద్దని, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు

ఇదిలా ఉండగా, మహిళా రిజర్వేషన్‌కు అనుసంధానమైన ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు కోరేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు సంప్రదించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాహుల్‌ గాంధీ కోరినట్లు సమాచారం. అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతోనూ చర్చించనున్నట్లు ఆయన తెలిపినట్లు వర్గాలు పేర్కొన్నాయి.

2026 ఏప్రిల్‌ 16న లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచడంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ అమలుకు ఈ బిల్లు ఉద్దేశించింది. అయితే పార్లమెంట్‌లో హాజరై ఓటు వేసిన సభ్యుల్లో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో అప్పట్లో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షాలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది.