Let's talk: editor@tmv.in
డీలిమిటేషన్ ప్రతిపాదన.. రాజ్యాంగంపై దాడే: సోనియా గాంధీ

డీలిమిటేషన్ ప్రతిపాదన.. రాజ్యాంగంపై దాడే: సోనియా గాంధీ

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైందని, ఇది రాజ్యాంగంపై దాడితో సమానమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆరోపించారు. ఆమె ఓ పత్రికలో రాసిన వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించడంలో అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్ కాదని, డీలిమిటేషన్ అంశమే ప్రధానంగా ఉందని ఆమె పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచే విధంగా జరిగే డీలిమిటేషన్ రాజకీయంగా సమతుల్యంగా ఉండాలని, కేవలం గణాంకాల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రత్యేక సమావేశంపై విమర్శలు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఆమె విమర్శించారు. ఈ తొందరపాటు నిర్ణయం ద్వారా ప్రతిపక్షాలను రక్షణాత్మక స్థితిలోకి నెట్టివేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్ చట్టంపై వ్యాఖ్యలు

2023లో పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారని ఆమె గుర్తుచేశారు. అయితే ఈ రిజర్వేషన్ అమలు జనగణన పూర్తయ్యాక జరిగే డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాతనే అమల్లోకి రావాలని చట్టంలో పేర్కొన్నారని తెలిపారు.

కులగణనపై ఆరోపణ

ప్రధాని మోడీ గతంలో కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, తరువాత 2027 జనగణనలో కుల గణన ఉంటుందని ప్రకటించారని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కులగణన ప్రక్రియను ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.

జనగణన ఆలస్యం

2021లో జరగాల్సిన జనగణన ఐదేళ్లు ఆలస్యమైన తర్వాత ఇప్పుడు ప్రారంభమవుతోందని ఆమె తెలిపారు. డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నందున 2027 నాటికే జనాభా గణాంకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారని చెప్పారు. కుటుంబ నియంత్రణలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు లేదా చిన్న రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోకూడదని కోరారు. కేవలం జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెరిగితే కొన్ని రాష్ట్రాల రాజకీయ ప్రభావం తగ్గే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

ప్రతిపక్షాల డిమాండ్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల చివరి దశ పూర్తైన తర్వాత ఏప్రిల్ 29న అన్ని పార్టీల సమావేశం నిర్వహించి కేంద్ర ప్రతిపాదనలను చర్చించాలని ప్రతిపక్షాలు మూడుసార్లు కేంద్రాన్ని కోరినప్పటికీ, ప్రభుత్వం ఆ అభ్యర్థనను తిరస్కరించిందని గుర్తు చేశారు. జూలైలో ప్రారంభమయ్యే పార్లమెంట్ మాన్సూన్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిపినా ఎలాంటి సమస్య ఉండదని ఆమె పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ అంశం ఇప్పటికే నిర్ణయించిందన, అసలు సమస్య డీలిమిటేషన్ ప్రతిపాదనలో ఉందని అన్నారు. ప్రస్తుతం అనధికారికంగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైందని, అది రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆమె మరోసారి హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనుంది. ఇందులో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు చేసి 2029 ఎన్నికల నుంచి అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం తీసుకురానుంది.