Let's talk: editor@tmv.in
డీలిమిటేషన్ ప్రతిపాదన ఉత్తర–దక్షిణ విభజనకు దారి తీస్తుంది: కాంగ్రెస్

డీలిమిటేషన్ ప్రతిపాదన ఉత్తర–దక్షిణ విభజనకు దారి తీస్తుంది: కాంగ్రెస్

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లుతో అనుసంధానించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆరోపించింది. పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాథే న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజన కేవలం గణాంకాల ఆధారంగా కాకుండా సమానత్వం దృష్టితో జరగాల్సిన అవసరం ఉందన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందుండి, అభివృద్ధి సూచికల్లో మెరుగ్గా ఉన్నందుకు నష్టపోకూడదని ఆమె అన్నారు. డీలిమిటేషన్‌ను ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం ఉత్తర–దక్షిణ విభజనను సృష్టించడానికే అనిపిస్తోందని శ్రినాథే వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రాల స్వరం పార్లమెంట్‌లో తగ్గిపోతే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని హెచ్చరించారు.

మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీశక్తి వందన్‌ అధినియమ్‌ను 2023 సెప్టెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించినప్పుడు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. అయితే ఆ సమయంలోనే మహిళా రిజర్వేషన్‌ను డిలిమిటేషన్ లేదా కుల జనగణనతో అనుసంధానం చేయకుండా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఇటీవల రాసిన వ్యాసాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ప్రధాన సమస్య మహిళా రిజర్వేషన్ కాదు, డీలిమిటేషన్ ప్రక్రియేనని అన్నారు.

ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనను ప్రతిపక్షాలతో చర్చించకుండా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించడం సరైంది కాదని ఆమె విమర్శించారు. ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని కూడా ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య రాజ్యాంగ సవరణకు దారితీసేంత కీలకమైనది కాబట్టి అన్ని పార్టీలతో చర్చ జరపాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

మహిళా రిజర్వేషన్ అమలుపై ఏప్రిల్‌ 15న ప్రతిపక్షాల సమావేశం: ఖర్గే

మహిళా రిజర్వేషన్ చట్టం అమలు అంశంపై చర్చించేందుకు ఏప్రిల్‌ 15న అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో సమగ్రంగా చర్చించడానికి సిద్ధంగా లేదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ఈ చట్టం అమలు విషయంలో విస్తృత చర్చ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం తరఫున కిరెన్‌రిజిజు లేదా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పంపిన లేఖకు తాను ఇప్పటికే సమాధానం ఇచ్చినట్లు ఖర్గే తెలిపారు. ప్రభుత్వం అన్ని పార్టీలను పిలిచి చర్చలకు అవకాశం ఇస్తే తమ అభిప్రాయాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వం గతంలోనే మహిళా రిజర్వేషన్‌కు మద్దతు తెలిపిందని, ముఖ్యంగా పార్టీ నేత సోనియాగాంధీ చాలా కాలం క్రితమే ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లలో మహిళలకు రిజర్వేషన్ అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని కూడా చెప్పారు. దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవడం అవసరమని ఖర్గే పేర్కొన్నారు.