
డీయూలో నిరసనలపై పూర్తి నిషేధం తగదు: హైకోర్టు
డిల్లీ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసనలపై విధించిన పూర్తి నిషేధాన్ని తక్షణం నిలిపివేయడానికి ఢిల్లీ హై కోర్టు నిరాకరించింది. అయితే ఇలాంటి సంపూర్ణ నిషేధం కొనసాగడం సరికాదని స్పష్టం చేసింది. ఈ నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై స్పందన ఇవ్వాలని ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి డీకే.ఉపాధ్యాయ, న్యాయమూర్తి తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ ఆదేశం ఎప్పటి నుంచి అమల్లో ఉంది? మరో పది రోజులు అలాగే కొనసాగనివ్వండని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో సమతుల్యం అవసరమని కోర్టు సూచించింది. యూనివర్సిటీ, పోలీసు అధికారులు ఒక వారం లోపు తమ సమాధానాలు సమర్పించాలని గురువాం ఆదేశిస్తూ, తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది.
కేంద్రానికి, రెండు కాలేజీలకు నోటీసులు
ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే డిల్లీ యూనివర్సిటీకి చెందిన రెండు కళాశాలలకూ నోటీసులు పంపింది. డిల్లీ యూనివర్సిటీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, నార్త్ క్యాంపస్ ప్రాంతంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపుగా చేరకుండా డిల్లీ పోలీసు జారీ చేసిన నిషేధాజ్ఞ ఆధారంగానే యూనివర్సిటీ ప్రాక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
కోర్టు ప్రశ్నలు
విచారణ సందర్భంగా కోర్టు యూనివర్సిటీ, పోలీసులను ప్రశ్నించింది. పూర్తిస్థాయి నిషేధం ఉండకూడదనే స్పష్టమైన అభిప్రాయం తమదని తెలిపింది. అయితే విద్యార్థులు కూడా తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని కోర్టు హెచ్చరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ –19 ప్రకారం మేము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాం. మీరు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. కోర్టు విద్యార్థుల ప్రవర్తనపై నేరుగా వ్యాఖ్యానించదలచుకోలేదని చెప్పినా, ఇటీవల జరిగిన విద్యార్థి ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను ప్రస్తావించింది. ఏ విద్యాసంస్థాధిపతి ఇలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకుంటాడు? పరిస్థితులు అలా మారినప్పుడు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కూడా సరిగా ప్రవర్తించేలా చర్యలు తీసుకోండని కోర్టు తెలిపింది.
పోలీసుల వాదన
డిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ, రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగే అవకాశంపై వచ్చిన గూఢచారి సమాచారం ఆధారంగా తీసుకుని మొదట ఒక నెలపాటు నిషేధాజ్ఞ జారీ చేశామని చెప్పారు. అనంతరం ఆ ఆదేశాన్ని ఫిబ్రవరిలో ఏప్రిల్ 25 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటికే ఒకసారి ఘర్షణ జరిగింది. వారు పోలీస్ స్టేషన్‌ను కూడా ముట్టడించారని పోలీసుల తరఫు న్యాయవాది చెప్పారు.
పూర్తి నిషేధం కాదు, పరిమితులతో అనుమతి ఇవ్వొచ్చు
శాంతిభద్రతలు కాపాడటం పోలీసుల బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. సమావేశాలను పూర్తిగా నిషేధించకుండా కొన్ని పరిమితులతో అనుమతించవచ్చని సూచించింది. మీ అభిప్రాయం ప్రకారం పరిమితులు లేకుండా సమావేశాలు జరిగితే సమస్యలు వస్తాయనుకుంటున్నారు. అయితే పరిమితులతో అనుమతించండి. కానీ పూర్తిగా నిషేధించడం ఆర్టికల్ 19 ఉల్లంఘన కాదా? అని కోర్టు ప్రశ్నించింది. అలాగే తక్షణ ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే నిషేధాజ్ఞలు జారీ చేయాలని, నిరవధికంగా అలాంటి ఆదేశాలు కొనసాగించడం సరైంది కాదని పేర్కొంది.
పిటిషనర్ వాదన
క్యాంపస్ లా సెంటర్‌కు చెందిన న్యాయ విద్యార్థి ఉదయ్ భదోరియా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 17న డిల్లీ యూనివర్సిటీ ప్రాక్టర్ విద్యార్థి సంఘం, కళాశాలలు, ఉపాధ్యాయ సంఘం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదా అకడమిక్ కౌన్సిల్‌తో చర్చించకుండా ఈ నిషేధాన్ని ప్రకటించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నిషేధం స్పష్టతలేని విధంగా ఉందని, అలాగే వాక్ స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, స్వేచ్ఛగా సంచరించే హక్కులు వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నిషేధం కారణంగా అనేక కళాశాలల్లో కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించలేకపోతున్నారని, వార్షిక వేడుకలు కూడా రద్దు, వాయిదా పడుతున్నాయని తెలిపారు.
ఘర్షణల తర్వాత నిషేధం
ఫిబ్రవరిలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణపై డిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన తర్వాత ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 12న సామాజిక న్యాయం కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రముఖ చరిత్రకారుడు ఇర్పాన్ హాబీబ్‌పై కొందరు వ్యక్తులు నీళ్ల బకెట్ విసిరిన ఘటన కూడా అప్పట్లో వివాదానికి దారితీసింది.
