
డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ వివరాలను వెల్లడించారు.డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేత కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ మావోయిస్టు పార్టీ నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. ఈ ముగ్గురూ మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులుగా ఉన్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య 1990లో పీడబ్ల్యూడీ ఏర్పాటు చేసిన రైతు కూలీ సభలకు హాజరై అదే ఏడాది అజ్ఞాతంలోకి వెళ్లారని శివధర్ రెడ్డి తెలిపారు. పీడబ్ల్యూడీ కమాండర్ బాలన్న ఆధ్వర్యంలో దళంలో చేరారని, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 35 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారని వివరించారు.
చిన్నవయస్సులోనే విప్లవ గీతాలకు ఆకర్షితుడై
లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు సర్కారు ఇచ్చిన పిలుపును అందుకుని జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. హనుమకొండ జిల్లాలోని ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరాజు(45) అనే వ్యక్తి 11 ఏళ్ల వయసులోనే విప్లవగీతాలకు ఆకర్షితుడై మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ఈయన 1993లో నర్సంపేట దళంలో రిక్రూట్ అయి రాష్ట్రస్థాయి కమిటీలో వివిధ హోదాల్లో పనిచేశారు. మావోయిస్టులతో వచ్చిన సైద్ధాంతిక విభేదాల కారణంగా పోలీసులు ఇచ్చిన పిలుపును అందుకుని అతని భార్య తోడెం గంగతో కలిసి పోలీసుల ఎదుట వెంకటరాజు లొంగిపోయారు అని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల కాలంలో 403 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారని ఆయన వివరించారు.
