Let's talk: editor@tmv.in
డీకే శివకుమార్ ను కలిసిన కిరణ్ మజుందార్ షా

డీకే శివకుమార్ ను కలిసిన కిరణ్ మజుందార్ షా

Pinjari Chand
22 అక్టోబర్, 2025

బయోకాన్ అధినేత, పారిశ్రామికవేత్త అయిన కిరణ్ మజుందార్-షా మంగళవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, రాష్ట్ర అభివృద్ధి గురించి విస్తృతంగా చర్చించారు. ఈ విషయాన్ని డీకే శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

‘బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్​ మజుందార్ షాని ఈరోజు మా నివాసంలో కలవడం ఆనందంగా ఉంది. బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, కర్ణాటక అభివృద్ధి పై ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.

ఇద్దరి మధ్య వివాదం సమసినట్టేనా?

ఇటీవలి బయోకాన్ ఎండీకి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగింది. మజుందార్ షా రాష్ట్రంలోని ముఖ్యంగా బెంగుళూరులోని రోడ్ల దుస్థితిపై వరుస పోస్టులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపారు. దీంతో డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్య ఈ సమస్యను చాలా సీరియస్ గా తీసుకున్నారు. బెంగుళూరులో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి, వాటికి మరమ్మతులు చేపట్టడమే పనిగా పెట్టుకున్నారు. డీకే శివకుమార్ అయితే చిన్నగుంతకు మరమ్మతు చేసినా సోషల్ మీడియాలో అప్​ లోడ్ చేసే పరిస్థితి ఏర్పడింది. తాజాగా కిరణ్ మజుందార్-షా చెత్త నిర్వహణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోకాన్ పార్క్‌ను సందర్శించిన విదేశీ వ్యాపార ప్రతినిధి బెంగళూరు రోడ్ల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఆమె ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

బయోకాన్ పార్క్‌కి వచ్చిన విదేశీ ప్రతినిధులు రోడ్లు ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నాయి? రోడ్లపై ఇంత చెత్త ఎందుకు ఉంది? ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహించదా? నేను చైనాకు వెళ్లి వచ్చాను, భారతదేశం ఎందుకు ఇంత వెనుకబడి ఉందో అర్థం కావడం లేదు. అని పోస్ట్ చేశారు. దీంతో మళ్లీ వివాదం రాజుకుంది.

వ్యంగ్యంగా స్పందించిన డీకే శివకుమార్

‘ఆమెకే రోడ్లు అభివృద్ధి చేయాలనుకుంటే, మేం ఇస్తాం. ఆమె అడిగితే రోడ్లను అభివృద్ధి చేసే పనులు ఆమెకే అప్పజెపుతాం’ అని వాక్ విత్ బెంగుళూరు కార్యక్రమంలో వ్యంగాస్త్రాలు సంధించారు. అదే సమయంలో కొంతమంది పారిశ్రామికవేత్తలపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరు వల్లనే ఎదిగిన కొందరు పారిశ్రామికవేత్తలు ఇప్పుడు నగరాన్ని విమర్శిస్తున్నారు. తమ మూలాలను మరచిపోకూడదు ఘాటుగా మాట్లాడారు. దీంతో రోజురోజుకు వివాదాలు పెరుగుతుండడం, పారిశ్రామికవేత్తలకు, ప్రభుత్వానికి అంతరం పెరుగుతున్న సమయంలో డీకే శివకుమార్ తో కిరణ్ మజుందార్ షా బేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

డీకే శివకుమార్ ను కలిసిన కిరణ్ మజుందార్ షా - Tholi Paluku