Let's talk: editor@tmv.in
డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి: వైఎస్ జగన్ డిమాండ్

డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలి: వైఎస్ జగన్ డిమాండ్

Gaddamidi Naveen
27 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

నీట్ పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించిన జగన్.. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, ఎన్డీయే ప్రభుత్వంలో రాజకీయ జవాబుదారీతనానికి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు. ఇప్పుడు అదే ప్రశ్నాపత్రాన్ని మేము ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నామ‌ని పేర్కొన్నారు.

సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు రాసిన డీఎస్సీ పరీక్ష ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించిన జ‌గ‌న్, కేంద్రంలో పాటిస్తున్న జవాబుదారీతనాన్ని ఏపీలోనూ అమలు చేస్తారా? లేదా సీఎం చంద్రబాబు తన కుమారుడిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారా? అని ప్రశ్నించారు.

నారా లోకేష్ కౌంటర్

వైఎస్ జగన్ విమర్శలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా 'ఎక్స్' వేదికగానే గట్టిగా సమాధానమిచ్చారు. కొందరు నైతిక బాధ్యత గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ వారి సొంత గతం, చరిత్ర తీరు చూస్తే పూర్తి భిన్నమైన కథ కనిపిస్తుందని అంటూ లోకేష్, జగన్ డిమాండ్‌ను తిరస్కరించారు.