

డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
అయితే, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఆరోపణలను అధికార తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. 'మెగా డీఎస్సీ' నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమర్థించినప్పటికీ, ప్రతిపక్షం దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తోందని మండిపడింది. వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
వైఎస్సార్సీపీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 'మెగా డీఎస్సీ' పేరుతో నిర్వహించిన ఉపాధ్యాయ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. మెగా డీఎస్సీని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు, కానీ ఇందులో అనేక అక్రమాలు జరిగాయి. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ నియామకాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. గత రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 5.5 లక్షలకు పైగా తగ్గిందని, ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.1 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని ప్రభుత్వం చెబుతున్న మాటలు పూర్తిగా అబద్ధమని తెలిపింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా పలు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరలేదని, ఈ ఏడాది 'విద్యార్ధి కానుక' పథకాన్ని అమలు చేయలేదని విమర్శించింది.
పాఠశాలకు వెళ్లే ప్రతి చిన్నారికి ఏటా రూ. 15,000 అందించే 'తల్లికి వందనం' పథకం నుంచి 22.6 లక్షల మందికి పైగా లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాన్ని పునరుద్ధరించాలని అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు హామీ ఇచ్చిన రూ. 3,000 నిరుద్యోగ భృతిని చెల్లించాలని వైఎస్సార్సీపీ కోరింది. ప్రభుత్వ పాఠశాలలను, రక్షించుకోవడానికి, విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికే ఈ నిరసనలు చేపట్టినట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు.
ఆర్కే రోజా విమర్శలు
వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ, నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులు ఎంతగా ఆందోళన చేస్తున్నా సీబీఐ విచారణ డిమాండ్‌ను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత తమ ప్రభుత్వ హయాంలో 1.3 లక్షల మందికి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం కనీసం 16,000 ఉద్యోగాలను కూడా సరిగ్గా భర్తీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.
స్పోర్ట్స్ కోటా సహా ప్రతిరోజూ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని, బాధితులు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారని రోజా తెలిపారు. గత రెండు నెలలుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్నా మంత్రి లోకేష్ జవాబు చెప్పలేకపోయారని విమర్శించారు. నీట్ వివాదంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాదిరిగానే, లోకేష్ కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరో మాజీ మంత్రి కె. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గొప్పగా ప్రచారం చేసుకున్న మెగా డీఎస్సీ కాస్తా నిరుద్యోగులను మోసం చేసే "దగా డీఎస్సీ"గా మారిందని ఆరోపించారు. జీవోల మార్పులు, అక్రమాల ద్వారా యువతను ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
వైఎస్సార్సీపీ ఆరోపణలను తిప్పికొట్టిన టీడీపీ
వైఎస్సార్సీపీ నిరసనలపై టీడీపీ అధికార ప్రతినిధి ఎన్. విజయ్ స్పందిస్తూ, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు వాస్తవ దూరమని, రాజకీయంగా ఉనికి కాపాడుకునేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. నియామకానికి ముందు, తరువాత వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ భర్తీ ప్రక్రియను సమర్థించిందని విజయ్ స్పష్టం చేశారు. నిరూపితమైన తప్పులు, బలమైన ఆధారాలు లేదా న్యాయస్థానాల వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నప్పుడే రాజీనామా డిమాండ్ చేయడానికి అర్థం ఉంటుందన్నారు. ఉద్యోగాలు రాని అభ్యర్థులను రెచ్చగొట్టి, వైఎస్సార్సీపీ తన రాజకీయ లబ్ధి కోసం వారి భావోద్వేగాలతో ఆడుకుంటోందని ఆరోపించారు.
3.5 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన ఈ డీఎస్సీ పరీక్షలు ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా, జాతీయ ప్రోటోకాల్స్, కఠినమైన భద్రతా ప్రమాణాలతో పారదర్శకంగా జరిగాయని విజయ్ తెలిపారు. కోర్టు పిటిషన్లను కొట్టివేసి నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా రాజీనామా డిమాండ్ చేయడం న్యాయవ్యవస్థను అవమానించడమేనన్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయిందని, తమ కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా, పారదర్శకంగా నియామకాలు చేపడుతోందని విజయ్ పేర్కొన్నారు.
