
డీఎస్సీలో మెరిట్ ర్యాంకర్లను రిజర్వేషన్‌లో లెక్కించడం రాజ్యాంగ విరుద్ధం
మెగా డీఎస్సీ నియామకాల్లో మెరిట్ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీకి దించి రిజర్వేషన్ సీట్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమని, మెరిట్ సాధించిన వారిని ఓపెన్ కేటగిరీలోనే లెక్కించాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండ్ చేశారు.
డీఎస్సీలో మెరిట్ సాధించిన వారిని రిజర్వేషన్‌లో పెట్టడం వల్ల రిజర్వేషన్ పోస్టులు తగ్గిపోయి, ర్యాంకులు పొందిన వందల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అర్హత కోల్పోయారని, ఈ తప్పిదాలు సరిదిద్ది న్యాయం చేయాలని విదసం ఆధ్వర్యంలో విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ అమలు కోసం 2023 జీవో 77 రూల్స్ ప్రకారం నియామకం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఆ జీవోలో పొందుపరచిన 2వ క్లాజు విస్మరించిదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు ఎవరైనా కటాఫ్ మార్కులు దాటి మెరిట్ సాధిస్తే వారిని రిజర్వేషన్ కోటాలో లెక్కించకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ మెరిట్ ర్యాంకులు పొందిన అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలను రిజర్వేషన్‌లో లెక్కించి సుప్రీంకోర్టు తీర్పులను సైతం ఉల్లంఘించారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ తప్పిదాలను సరిదిద్ది మెరిట్ వారిని ఓపెన్ కేటగిరిలో ఉంచి వర్టికల్ రిజర్వేషన్లలో రాజ్యాంగం ఇచ్చిన కోటాను నింపాలని డిమాండ్ చేశారు.
బూల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖ జిల్లా నుండి నష్టపోయిన అభ్యర్థులు వారి వారి ర్యాంకు కార్డులు, రుజువులతో ఆర్‌జెడి కార్యాలయంలో పిర్యాదు చేశారు.
