
డీఎంకే స్పందన కోసం ఎదురుచూస్తున్నాం: కాంగ్రెస్
త్వరలో జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం డీఎంకేతో కూటమి ఏర్పాటు విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. డీఎంకే స్పందన కోసం గత రెండు నెలలుగా ఎదురు చూస్తున్నామని తమిళనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ బుధవారం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు కూటమి చర్చలు ప్రారంభం కాలేదని ఆయన చెప్పారు. డీఎంకే నుంచి స్పందన కోసం మేము ఎదురు చూస్తున్నాం. గత రెండు నెలలుగా వారి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఇప్పటికీ చర్చలు మొదలవ్వలేదు. ఈ ఆలస్యం ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. ఇదిలా ఉండగా మా రాజకీయ ప్రత్యర్థులు మాత్రం చాలా దూకుడుగా పనిచేస్తున్నారని చోడంకర్ అన్నారు.
నవంబర్‌లోనే కూటమి కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి కూటమి చర్చలను పూర్తిచేసి, పొత్తును ఖరారు చేయాలని మేము కోరాం. అయితే ఇంకా అది సాధ్యపడలేదు. ఆలస్యం ఎందుకు జరుగుతోందో తెలియదు. అయినా త్వరలోనే డీఎంకే ఈ చర్చలను ముగిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
234 సభ్యులున్న తమిళనాడు శాసనసభకు 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 18, పీఎంకే 5, వీసీకే 4 స్థానాలు సాధించగా, ఇతరులు 8 స్థానాలు దక్కించుకున్నారు. ఏఐఏడీఎంకే 66 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ) మొత్తం 159 స్థానాలు గెలుచుకోగా, ఎన్‌డీఏ 75 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ డీఎంకే–కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఇటీవల ఎన్‌డీఏను ‘బాక్స్ ఇంజిన్’గా వ్యాఖ్యానించిన నేపథ్యంలో స్పందించిన ఆయన, ఎన్నికల అనంతరం ఏది విఫలమైన ఇంజిన్, ఏది బాక్స్ ఇంజిన్, ఏది వందే భారత్ ఇంజిన్ అన్నది ప్రజలకు స్పష్టమవుతుందని అన్నారు.
డీఎంకే–కాంగ్రెస్ కూటమి స్థిరత్వంపై కూడా నాగేంద్రన్ సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తున్నాయి. కాంగ్రెస్ డీఎంకే కూటమిలో కొనసాగుతుందా లేదా అన్నది కూడా స్పష్టంగా లేదు. ఈ కూటమి చివరకు విఫలమైన ఇంజిన్‌గా మారే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రాజకీయాల్లో వేడి క్రమంగా పెరుగుతోంది.
