
డీఎంకే మ్యానిఫెస్టో విడుదల
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ కీలక హామీలతో తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మహిళలు, యువత, రైతులు, మత్స్యకారులు వంటి వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆదివారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిళల కోసం ‘ఇల్లతరాసి’ కూపన్ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాల మహిళలకు ఒకసారి రూ.8,000 విలువైన కూపన్ ఇస్తారు. ఈ కూపన్‌తో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, మిక్సీ, మైక్రోవేవ్ ఓవెన్, ఇండక్షన్ స్టవ్ వంటి గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి లేదా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ‘ఇల్లతరాసి’ అంటే ఇంటి మహిళ అధిపతి అనే అర్థం.
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్న ‘కళైంగర్ మహిళ ఉరిమై తొగై’ పథకం కింద నెలకు ఇచ్చే రూ.1,000 సాయాన్ని రూ.2,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, 50 ఏళ్లు దాటిన అవివాహిత మహిళలకు పెన్షన్‌ను నెలకు రూ.2,000కు పెంచుతామని తెలిపారు. ఆరోగ్య రంగంలో సీఎం హెల్త్ ఇన్సూరెన్స్ పథక పరిధిని రూ.10 లక్షలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేసి, 11 ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
విద్య రంగంలో పలు కీలక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ‘పుధుమై పెన్’, ‘తమిళ్ పుధల్వన్’ పథకాల కింద విద్యార్థులకు ఇచ్చే నెలవారీ సహాయాన్ని రూ.1,500కు పెంచుతారు. అలాగే అన్ని కళాశాల విద్యార్థులకు 35 లక్షల ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తామని తెలిపారు. ‘నాన్ ముదలవాన్’ పథకం కింద ఉన్నత విద్య పూర్తి చేసిన 5 లక్షల యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, శిక్షణ కాలంలో నెలకు రూ.1,500 స్టైపెండ్ అందిస్తారు. వ్యవసాయ రంగంలో రైతులకు ఉచిత విద్యుత్ పొందుతున్న 20 లక్షల మందికి ఆధునిక ఎలక్ట్రిక్ పంప్‌సెట్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. వరి కొనుగోలు ధరను క్వింటాల్‌కు రూ.3,500కు, చెరకు ధరను టన్నుకు రూ.4,500కు పెంచుతామని ప్రకటించారు. పాలు కొనుగోలు ధరను లీటర్‌కు రూ.5 పెంచుతారు.
10 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం
గృహ నిర్మాణంలో భాగంగా ‘కళైంగర్ కనవు ఇల్లం’ పథకం కింద 10 లక్షల కొత్త పక్కా ఇళ్లను నిర్మించి, 2030 నాటికి గుడిసెలేని తమిళనాడు లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. యువత ఉపాధి కోసం ఐదు సంవత్సరాల్లో రూ.18 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చి 50 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. మత్స్యకారులకు నిషేధ కాలంలో ఇచ్చే సాయాన్ని రూ.8,000 నుంచి రూ.12,000కు, లీన్ పీరియడ్ సాయాన్ని రూ.6,000 నుంచి రూ.9,000కు పెంచుతారు. అలాగే కోయంబత్తూరు, సేలం, మదురై, తిరుచిరాపల్లి ప్రాంతాల చుట్టూ నాలుగు గ్లోబల్ సిటీలు ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా 50 ‘సెమ్మొళిపూంగా’లను నిర్మించాలని ప్రణాళికలు ప్రకటించారు. ఈ మేనిఫెస్టోను పార్టీ ఎంపీ కనిమొళి నేతృత్వంలోని కమిటీ రూపొందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేము అమలు చేయలేని హామీలు ఇవ్వలేదు. ఇచ్చిన ప్రతిదాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వం ఏడోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకం వ్యక్తం చేసిన స్టాలిన్, రాష్ట్ర ప్రజల మద్దతు తమకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
