Let's talk: editor@tmv.in
డీఎంకే మాపై నిత్యం విమర్శలు చేస్తోంది: పళనిస్వామి

డీఎంకే మాపై నిత్యం విమర్శలు చేస్తోంది: పళనిస్వామి

Pinjari Chand
13 అక్టోబర్, 2025

బీజేపీతో మేం పొత్తు పెట్టుకున్న తర్వాత మా పార్టీ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతోందని, దాన్ని సహించలేకే డీఎంకే నిత్యం తమపై విమర్శలు చేస్తోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాకు ఎవరి తోడు కావాలో మేం నిర్ణయించుకుంటాం. డీఎంకే పొత్తులో చాలా పార్టీలు ఉన్నాయి. అయితే మేం ఎవరితో కలిసి ముందుకు వెళితే డీఎంకే నాయకులకు ఎందుకు అని పళనిస్వామి ప్రశ్నించారు. డీఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసంతృప్తిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎక్కువ స్థానాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారి పొత్తులో చీలికలు మొదలైనట్టే అని ఆయన తెలిపారు.

టీవీకే జెండాలపై డీఎంకే అనవసరమైన విమర్శలు చేస్తోంది

జిల్లా కార్యదర్శులకు ముందుగా అనుమతి తీసుకుని మాత్రమే ఇతర పార్టీ జెండాలు ప్రదర్శించమని సూచించాం. కానీ కొందరు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. దీనిపై ప్రతిపక్షం అనవసరమైన విమర్శలు చేస్తోంది అని అన్నారు. దీంతో అన్నాడీఎంకే సమావేశాల్లో తమిళ వెట్రి కళగం (టీవీకే) జెండాలు కనిపించడంపై ఆయన వివరణ ఇచ్చారు. మేం బలం పెంచుకుంటూ ఉంటే వారు సహించలేకపోతున్నారు. ప్రజల్లోకి వెళుతుంటే భరించలేకపోతున్నారని డీఎంకే నేతలను విమర్శించారు. అలాగే టీటీవీ దినకరన్ వ్యాఖ్యలపై కూడా పళని స్వామి స్పందించారు. బీజేపీ, టీవీకేతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకుంటే మేం కూటమిలో నుంచి వీడిపొతామన్న ఆయన మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా పార్టీకి రెండు కోట్లకు పైగా కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. మేం ఎప్పుడు ఎన్నికలకు ముందే పొత్తులు పై నిర్ణయం తీసుకుంటాం. 2019, 2021, 2024 ఎన్నికల్లో కూడా అలానే చేశాం. ఈసారి కూడా అదే విధానం కొనసాగుతుంది. కరూర్ దుర్ఘటన తరువాత నేను విజయ్ తో మాట్లాడలేదు. కానీ స్వయంగా బాధిత కుటుంబాలను కలిసి వారిని పరామర్శించాను అని చెప్పారు. పీఎంకే నేత డాక్టర్ రామదాస్‌ ను ఆయన ఆరోగ్యం గురించి మాత్రమే పరామర్శించడానికే కలిశానని, పొత్తులకు ఏమాత్రం కాదన్నారు. మా మధ్య రాజకీయ చర్చలేవి జరగలేదన్నారు.

ఎడప్పాడి నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయన వైరన్ సరస్సు, వతిపట్టి సరస్సులను పరిశీలించారు. మెట్టూరు ఆనకట్ట నీటిని 100 సరస్సులకు మళ్లించే ప్రాజెక్టు పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టును అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రారంభించింది. కానీ డీఎంకే ప్రభుత్వం వచ్చాక ఉద్దేశ పూర్వకంగా పనులు నెమ్మదించేలా చేసిందన్నారు. ఇప్పటివరకు కేవలం 59 సరస్సులు మాత్రమే నిండాయని. మేము తిరిగి అధికారంలోకి వస్తే 100 సరస్సులూ పూర్తిగా నింపుతాం. సముద్రంలో వృథా అవుతున్న నీటిని రైతుల ప్రయోజనానికి వినియోగిస్తాం అని పళనిస్వామి హామీ ఇచ్చారు.

డీఎంకే మాపై నిత్యం విమర్శలు చేస్తోంది: పళనిస్వామి - Tholi Paluku