
డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల
త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డీఎంకే పార్టీ 164 మంది అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మాట్లాడుతూ ఇవాళ ప్రకటించిన వారు కేవలం అభ్యర్థులు కాదు, గెలిచే అభ్యర్థులని విశ్వాసం వ్యక్తం చేశారు. డీఎంకే 2.0 ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ప్రస్తుత మంత్రివర్గంలోని దాదాపు అందరికీ మళ్లీ అవకాశం ఇచ్చారు. కేవలం ముగ్గురు మంత్రులను తప్పించి మిగతా వారందరినీ కొనసాగించారు. గతంలో హిందూ మత విభాగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా మంత్రి పదవి నుంచి తప్పుకున్న కే.పొన్ముడికి టికెట్ ఇవ్వలేదు. అయితే, ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు పొన్ గౌతమ సిగామణిని తిరుక్కోవిలూర్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టారు.
స్టాలిన్ స్వయంగా చెన్నైలోని కొలత్తూరు నియోజకవర్గం నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. 2011లో ఇక్కడి నుంచే ఆయన మొదటిసారి విజయం సాధించారు. మరోవైపు ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెపాక్-ట్రిప్లికేన్ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ తన సాంప్రదాయ కట్పాడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు పార్టీ మరోసారి అవకాశం కల్పించింది. ముఖ్య మంత్రివర్గంలోని కే.ఎన్. నెహ్రూ, ఈ.వి. వేళు, ఎస్. రఘుపతి, ఐ. పెద్దియస్వామి, ఆర్. సక్కరపాణి వంటి కీలక నేతలను కూడా యథాతథంగా కొనసాగించారు. అలాగే ఆర్థిక మంత్రి థంగం తేనరసు, పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, ఐటీ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ కూడా మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక ఈసారి డీఎంకే 60కి పైగా కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం గమనార్హం. అలాగే 18 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు. అభ్యర్థులలో 29 మంది న్యాయవాదులు, 17 మంది ఇంజినీర్లు, 15 మంది వైద్యులు ఉన్నారు.
మరో కీలక పరిణామంలో, ఇటీవలే డీఎంకేలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం కూడా బోడినాయకనూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక విద్యుత్ శాఖ మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీని కరూర్ నుంచి కోయంబత్తూరు సౌత్‌కు మార్చడం వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. కోయంబత్తూరు ప్రాంతంలో పార్టీ బలాన్ని పెంచడమే దీని లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో డీఎంకే 164 స్థానాల్లో నేరుగా పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలకు చెందిన మరో 11 మంది అభ్యర్థులు డీఎంకే గుర్తు ‘రైజింగ్ సన్’పై పోటీ చేస్తున్నారు. దీంతో డీఎంకే గుర్తుపై మొత్తం 175 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఏఐఏడీఎంకేపై స్టాలిన్ విమర్శలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార డీఎంకే మిత్రపక్షాలతో సీటు పంపకంపై వచ్చిన విమర్శలను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఖండించారు. సీట్ల కేటాయింపులో ఎలాంటి ఆలస్యం జరగలేదని, సహనంతో జరిగిన చర్చల వల్ల అందరూ సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. కూటమిలో ఐక్యతను కాపాడేందుకు ప్రత్యేకంగా కృషి చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఎఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి కే.పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు. సీటు పంపకం ఆలస్యమైందని, తమ పార్టీ ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారం ప్రారంభించిందని అన్నారు.
మిత్రులకు సీట్ల కేటాయింపు
మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో కాంగ్రెస్‌కు 28 స్థానాలు ఇవ్వగా, వాటిలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవంకోడ్, శివకాశి, కారైకూడి ముఖ్యమైనవి. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు 10 స్థానాలు కేటాయించగా, వృద్దాచలం, పల్లవరం వాటిలో ఉన్నాయి. తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకేకు 8 స్థానాలు దక్కాయి. లెఫ్ట్ పార్టీలలో సీపీఎంకు పద్మనాభపురం, పలాని వంటి 5 స్థానాలు ఇవ్వగా, సీపీఐకి తల్లి, భవానిసాగర్ (ఎస్సీ) సహా 5 స్థానాలు కేటాయించారు. వైకో నేతృత్వంలోని ఎమ్‌డీఎంకేకు 4 స్థానాలు లభించాయి. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేయనున్నట్లు స్టాలిన్ వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో డీఎంకే-ఏఐఏడీఎంకే మధ్య అనేక కీలక నియోజకవర్గాల్లో నేరుగా పోటీ ఉండనుంది. ముఖ్యంగా ఎడప్పడి కే. పళనిస్వామి (సొంత నియోజకవర్గం), తిరుచిరాపల్లి, తిరువెరుంబూర్, తంబరం, కట్పాడి వంటి చోట్ల పోటీ హోరాహోరీగా ఉండనుంది. ఇక ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 169 స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. ఇప్పటికే 150 అభ్యర్థులను ప్రకటించగా, కొన్ని మిత్రపక్షాలు కూడా ‘టూ లీవ్స్’ గుర్తుపై పోటీ చేయనున్నాయి. మొత్తంగా చూస్తే, డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్‌పీఏ) ఎన్డీయే మధ్య పోటీ ఉండనుంది.
కాంగ్రెస్‌లో అసంతృప్తి
తమిళనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి బయటపడటం రాజకీయంగా పెద్ద సంకేతంగా కనిపిస్తోంది. కరూర్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి చేసిన ఆరోపణలు చూస్తే, సీటు కేటాయింపులో పారదర్శకత లేకపోవడం, కేడర్ అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వంటి సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే కూటమిలో కాంగ్రెస్ బలం బలహీనపడే అవకాశం ఉంది. అయితే మరోవైపు కేవీ.తంగబాలు చెప్పినట్టు, పార్టీ లోపలే సమస్యలను పరిష్కరించుకోవడం కీలకం. మొత్తంగా, ఎన్నికల ముందు ఈ విభేదాలు బయటపడటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే, కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే అసలు పరీక్ష.
ఎన్నికల బరిలో సినీ దర్శకుడు సుందర్ సీ..మధురై సెంట్రల్ నుంచి పోటీ
ప్రముఖ సినీ దర్శకుడు సుందర్ సీ రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో ఆయన మధురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పుతియా నీతి కట్చి (పీఎన్‌కే) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ.సి. శణ్ముగం ప్రకటించారు. ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగమైన పీఎన్‌కే తరఫున సుందర్ సీ బరిలోకి దిగుతున్నారు. ఆయన ఏఐఏడీఎంకే ఎన్నికల గుర్తు ‘టూ లీవ్స్’పై పోటీ చేయనున్నారు.
సుందర్ సీ భార్య, బీజేపీ సీనియర్ నేత ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ, తన భర్త ప్రజల వ్యక్తిగా మారి రాష్ట్రానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్నికల్లోకి వస్తున్నారని తెలిపారు. మూడు దశాబ్దాలుగా తమిళనాడు ప్రజలను తన సినిమాల ద్వారా అలరించిన ఆయన, ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని సంకల్పించారని చెప్పారు. ఆయన ప్రయాణానికి కుటుంబ సభ్యుల ఆశీస్సులు, అలాగే ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పడి కే. పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సహా ఎన్డీయే నాయకుల మద్దతు ఉందని ఖుష్బూ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.మధురై సెంట్రల్ ప్రస్తుతం అధికార డీఎంకేకు బలమైన కోటగా ఉంది. అక్కడ ఐటీ, డిజిటల్ సర్వీసెస్ మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సుందర్ సీ రాజకీయ ప్రవేశం, ఈసారి జరుగుతున్న తమిళనాడు ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన వ్యక్తుల పెరుగుతున్న భాగస్వామ్యాన్ని మరింత పెంచింది. ఇప్పటికే నటుడు విజయ్ కూడా ఈ ఎన్నికల్లో రాజకీయంగా అరంగేట్రం చేస్తున్నారు.
