
డీఎంకే అంటే 'సిఎమ్‌సి ' ప్రభుత్వం: ప్రధాని మోదీ సంచలన విమర్శలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంఖారావం పూరించారు. శుక్రవారం మదురాంతకంలో జరిగిన ఎన్డీయే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపై నిప్పులు చెరిగిన ప్రధాని, ఆ పార్టీకి ' సిఎమ్‌సి ' అనే సరికొత్త పేరు పెట్టారు. సిఎమ్‌సిఅంటే Corruption (అవినీతి), Mafia (మాఫియా), Crime (నేరం ) అని మోదీ అభివర్ణించారు. డీఎంకే ప్రభుత్వం ఈ మూడు దురాచారాలను పెంచి పోషిస్తోందని, రాష్ట్ర ప్రజలు ఈ కూటమిని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు.
ఎన్నికల ప్రచారానికి భారీ స్పందన
2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి బలాన్ని చాటేలా ఈ సభ జరిగింది. వేదికపై ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్, పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రామదాస్ వంటి హేమాహేమీలు మోదీతో కలిసి కనిపించారు. ఈ కూటమి ఐక్యతను చూస్తుంటే డీఎంకే ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని స్పష్టమవుతోందని మోదీ పేర్కొన్నారు. తమిళనాడు గడ్డపై కమలం వికసించే సమయం ఆసన్నమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వారసత్వ రాజకీయాలపై విమర్శలు
డీఎంకే ప్రభుత్వం కేవలం ఒకే ఒక కుటుంబం ప్రయోజనాల కోసం పనిచేస్తోందని మోదీ ఆరోపించారు. "డీఎంకేకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు, జవాబుదారీతనం అంతకంటే లేదు. రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో పసిపిల్లాడిని అడిగినా చెబుతారు" అని ఎద్దేవా చేశారు. వారసత్వ రాజకీయం, మహిళలను కించపరచడం, తమిళ సంస్కృతిని అవమానించడమే ఆ పార్టీ నాయకుల వృద్ధికి మార్గాలని మోదీ విమర్శించారు.
సంస్కృతి, శాంతిభద్రతలు
ముఖ్యంగా తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయ కార్తీక దీపం వెలిగించే వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డీఎంకే భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. భక్తుల పక్షాన నిలబడిన తమ నాయకులను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం కోర్టులను కూడా వదల్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలు, మాదకద్రవ్యాలవినియోగం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, నేరాల నియంత్రణలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేసిన కృషిని కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైందని విమర్శించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి
తమిళనాడు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉండాలని, అప్పుడే కేంద్రంతో భుజం భుజం కలిపి అభివృద్ధి పథంలో నడవగలమని మోదీ పిలుపునిచ్చారు. "తమిళనాడు సంకెళ్లను తెంచుకుని, డీఎంకే నుండి విముక్తి పొందాలి. అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కార్‌కు ఓటు వేయండి" అని ప్రజలను కోరారు. ఈ సభతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
