Let's talk: editor@tmv.in
డీఎంకేను ఎవ్వరూ నాశనం చేయలేరు: సీఎం స్టాలిన్

డీఎంకేను ఎవ్వరూ నాశనం చేయలేరు: సీఎం స్టాలిన్

Pinjari Chand
11 నవంబర్, 2025

ఎన్ని కుట్రలు చేసినా డీఎంకేను ఎవ్వరూ నాశనం చేయలేరని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పష్టం చేశారు. సోమవారం తిరుచ్చిలో శ్రీరంగం ఎమ్మెల్యే పలనియాంది కుమారుడు విజయభారతి వివాహ వేడుకలో పాల్గొని మాట్లాడిన ఆయన, డీఎంకే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అది త్యాగం, పోరాటం, ప్రజలతో ఉన్న బంధంతో కొనసాగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు. డీఎంకే ఒక ఉద్యమం. అది అధికారంలో ఉన్నా, లేకున్నా పనిచేస్తూనే ఉంటుంది. మన 'ఉడన్పిరప్పే వా' కార్యక్రమాల్లో కేడర్ల ఉత్సాహం నాకు స్ఫూర్తినిస్తోంది అని తెలిపారు.

ఏఐడీఎంకే పై సీఎం విమర్శలు

తర్వాత రాజకీయ అంశాలపై మాట్లాడుతూ ఏఐఏడీఎంకేపై విరుచుకుపడ్డారు. మా ప్రత్యర్థులు మమ్మల్ని కూల్చేందుకు ఐటీ శాఖ, సీబీఐ, ఇప్పుడు కొత్తగా ‘ఎస్‌ఐఆర్’ అనే ఆయుధం వాడుతోంది. ఇవన్నీ ఎక్కడో పనిచేయొచ్చు కానీ తమిళనాడులో కాదు. డీఎంకేను ఎవ్వరూ ధ్వంసం చేయలేరు అని స్పష్టం చేశారు. డీఎంకే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎస్‌ఐఆర్‌పై పిటిషన్ వేసింది. దానికి మొదట మద్దతు ఇచ్చిన ఏఐఏడీఎంకే ఇప్పుడు మా పిటిషన్‌లో చేరింది. నిజంగా ప్రజల పక్షాన ఉంటే అప్పుడే కేసు వేసేవారు. ఇది వారి రాజకీయ నాటకమని చెప్పక తప్పదని విమర్శించారు. ఢిల్లీలో ‘బిగ్ బాస్’ చెప్పినట్లే ఎడప్పాడి పళనిస్వామి తల ఊపుతారు అంటూ స్టాలిన్ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. తదుపరి సీఎం మాట్లాడుతూ సీబీఐ, ఐటీ శాఖల వంటి ఆయుధాలతో మమ్మల్ని భయ పెట్టాలనుకున్నారు. కానీ విఫలమయ్యారు. ఇప్పుడు కొత్తగా ఎస్‌ఐఆర్‌ అనే ఆయుధం తెచ్చారు. కానీ డీఎంకేను ఎవ్వరూ నాశనం చేయలేరు అని ధైర్యంగా ప్రకటించారు.

వివాహ వేడుక సందర్భంగా మాట్లాడుతూ పలనియాంది పెళ్లిని మాజీ సీఎం కలైంగర్ జరిపారు. ఆయన అన్నయ్య, పెద్ద కుమారుడి పెళ్లి నేను జరిపాను. ఇప్పుడు చిన్న కుమారుడి పెళ్లి కూడా నేనే జరిపాను. భవిష్యత్తులో మనవళ్ల పెళ్లి కూడా నేనే జరుపుతాను అని స్టాలిన్ సరదాగా వ్యాఖ్యానించారు. విజయభారతి వివాహానికి మంత్రులు కే.ఎన్.నెహ్రు, రఘుపతి, గీతా జీవన్, అన్బిల్ మహేష్, శివశంకర్, మేయ్యనాథన్, డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శులు త్రిచీ శివ, ఏ.రాజా, అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.

వేదికపై విద్యామంత్రి అన్బిల్ మహేష్ మాట్లాడుతూ పలనియాంది స్కూల్లో ఉన్నప్పుడు నేను విద్యామంత్రిగా ఉండి ఉంటే ఆయన కాలేజీ పూర్తి చేసేవారు. తమిళనాడుకు మన సీఎం కారణంగానే. ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. 2026 ఎన్నికల్లో సీఎం వ్యూహకర్తగా, డిప్యూటీ సీఎం ప్రతిపక్షాలను తరిమేస్తారు. డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు.

డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి ఏ.రాజా మాట్లాడుతూ సర్కార్ నడుపుతూనే, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, పార్టీ కార్యకర్తల వివాహాలకూ సమయం కేటాయించే సీఎం మనకు ఉండడం అదృష్టం. డీఎంకే కుటుంబ పార్టీ కాదు, ప్రతి కుటుంబం డీఎంకేలో భాగం. ముఖ్యమంత్రి దృష్టి త్రిచీపైనే కాదు, ముతరయ్యర్ సమాజంపైన కూడా ఉంది అని పేర్కొన్నారు. రాజకీయ తుఫాన్లు తమిళనాడును చుట్టుముట్టాయి. శత్రువులు ముసుగులో నుంచి దాడి చేస్తున్నారు. కానీ మన సీఎం స్టాలిన్ బలంగా నిలబడ్డారు. ఆయన నిలబడితే తమిళనాడు ప్రజలు నిలబడతారు అన్నారు. చివరలో శ్రీరంగం ఎమ్మెల్యే పలనియాంది, పార్టీ ఎన్నికల నిధుల కోసం రూ.51 లక్షలు విరాళంగా సీఎంకు అందించారు.