
డీఎంకేతో జతకట్టిన డీఎండీకే
తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఆయా కూటములతో పొత్తులు కుదర్చుకుంటున్నాయి. తాజాగా దివంగత నటుడు విజయకాంత్ స్థాపించిన దేశీయ మురసు ద్రావిడ కజగం (డీఎండీకే) రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో చేరింది. దీంతో గత కొన్ని వారాలుగా కొనసాగిన రాజకీయ ఊహాగానాలకు తెరపడింది. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా ఆరివాలయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో ఈ కూటమి ఖరారైంది. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, పార్టీ ఖజాంచీ ఎల్.కే. సుధీష్ తదితర నేతలు స్టాలిన్‌ను కలిసి కూటమి ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. స్టాలిన్ వారిని శాలువాతో సత్కరించారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో స్టాలిన్ స్పందిస్తూ కెప్టెన్ విజయకాంత్ స్థాపించిన డీఎండీకే మా సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో చేరడం ఆనందంగా ఉంది. ప్రేమలత విజయకాంత్‌కు హృదయపూర్వక స్వాగతమని పేర్కొన్నారు. ద్రావిడ మోడల్ పరిపాలన కొనసాగింపే లక్ష్యమని, మా కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రేమలత మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని విని డీఎంకేతో కూటమి కుదుర్చుకున్నాం. కెప్టెన్ లేని సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ కూటమి 2016లోనే కుదరాల్సింది. 10 ఏళ్ల ఆలస్యంతో అయినా ఇప్పుడు డీఎంకేతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ఇది డీఎండీకే–డీఎంకే మధ్య తొలి ఎన్నికల కూటమి కావడం గమనార్హం. 2011లో డీఎండీకే, ఏఐఏడీఎంకేతో కలిసి పోటీ చేసి 29 సీట్లు గెలుచుకుని విజయకాంత్ ప్రతిపక్ష నేతగా నిలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టిటివి దినకరణ్ పార్టీతో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమిలో డీఎండీకే భాగమైంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, విడుదలై చిరుతైగల్ కట్చీ, మరుమలర్చి ద్రావిడ మున్నేట్ర కజగం తదితర పార్టీలు ఉన్నాయి.
ఎండీఎంకే నేత వైకో ఈ పరిణామాన్ని తీయని వార్తగా అభివర్ణించారు. వీసీకే నేత తోల్ తిరుమళవన్ కూడా డీఎండీకే చేరికతో ఘనవిజయం సాధ్యమని పేర్కొన్నారు.
మునిగిపోతున్న ఓడలో డీఎండీకే చేరింది
అయితే, తమిళనాడు బీజేపీ ఈ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. డీఎండీకే ‘మునిగిపోతున్న ఓడలో ఎక్కిందని ఆరోపించింది. డీఎంకేకు వ్యతిరేకంగా పోరాడిన కెప్టెన్ విజయకాంత్ ఆత్మ ఈ నిర్ణయాన్ని ఎప్పటికీ క్షమించదని బీజేపీ సోషల్ మీడియాలో పేర్కొంది. బీజేపీ నేత తమిళ సౌందరరాజన్ మాట్లాడుతూ వారు మునిగిపోతున్న ఓడలో ఎక్కారు. కెప్టెన్ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ కార్యకర్తలను దారితప్పిస్తున్నారని విమర్శించారు.
