
డీఎంకేకు మరోసారి అధికారం ఇవ్వండి: స్టాలిన్
మార్చి 9న తిరుచారపల్లిలో జరగనున్న పార్టీ రాష్ట్ర మహాసభకు హాజరుకావాలని, డీఎంకే రాష్ట్ర మహాసభలో భారీగా పాల్గొనాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకేస్టాలిన్ పిలుపునిచ్చారు. ఆయన ఓ బహిరంగ లేఖలో గురువారం అందరినీ ఆహ్వానించారు. పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో స్టాలిన్, రాబోయే 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. మన నాయకుడు కళైంగర్ మన జీవితాల్లో కలిసిపోయిన వ్యక్తి. మీ అందరికీ నేను ఈ లేఖ రాస్తున్నాను. ‘స్టాలిన్ కొనసాగాలి – తమిళనాడు గెలవాలి’ అనే నినాదంతో జరిగే డీఎంకే మహాసభకు అందరూ పెద్ద ఎత్తున రావాల’ని ఆయన పేర్కొన్నారు.
మార్చి 9న తిరుచిరాపల్లి సమీపంలోని సిరుగనూరులో ఈ మహాసభ జరుగుతుందని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి గ్రామ స్థాయి శాఖల వరకు అన్ని విభాగాలకు చెందిన దాదాపు పది లక్షల మంది కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు పార్టీ కృషి ఫలితాలను అందుకునే సమయమని, ఆ పోరాటానికి సిద్ధమయ్యేందుకు ఈ సమావేశం కీలకమని స్టాలిన్ పేర్కొన్నారు. ఈ వేదికపై ప్రారంభ కార్యక్రమంలో డీఎంకే పార్టీ జెండాను ఎగురవేయడానికి 100 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎన్నికల హామీలపై కీలక ప్రకటనలు కూడా ఈ మహాసభలో ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీఎంకే ‘ద్రావిడియన్ మోడల్ 2.0’ నినాదంతో మళ్లీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమికి ప్రత్యామ్నాయంగా ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ యోచిస్తోంది.
నెహ్రూను ప్రశంసించిన స్టాలిన్
తిరుచిరాపల్లి వెస్ట్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కేఎన్.నెహ్రును స్టాలిన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. త్రిచిలో జరిగే ప్రతి పార్టీ మహాసభ పార్టీ చరిత్రలో ఒక మలుపుగా నిలుస్తుంది. సమావేశం అంటే నెహ్రూ గుర్తుకొస్తారు. నెహ్రూ అంటే సమావేశం గుర్తుకొస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడూ మహాసభ ఏర్పాట్లను ఆయన అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్నారని స్టాలిన్ తెలిపారు.
కూటమి రాజకీయాలకు మద్దతు
డీఎంకే నేత స్టాలిన్ కూటమి రాజకీయాలను కూడా ప్రశంసించారు. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పడిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఇప్పటికీ బలంగా కొనసాగుతోందన్నారు. ఈ కూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు, 2021 అసెంబ్లీ , పట్టణ స్థానిక సంస్థల , 2024 లోక్‌సభ ఎన్నికలు వంటి అనేక ఎన్నికల్లో ఈ కూటమి కలిసి పోటీ చేసి విజయాలు సాధించిందని స్టాలిన్ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలపై విమర్శలు
ప్రతిపక్షాలు తమ బలం మీద నమ్మకం లేకపోవడంతో కూటమిని విభజించాలని ప్రయత్నించాయని స్టాలిన్ ఆరోపించారు. మా కూటమి కూలిపోతుందని వారు ఊహించారు. పార్టీలను విడదీయడానికి ప్రలోభాలు కూడా చూపించారు. కానీ మేము వాటిని పట్టించుకోకుండా మా పని చేసుకుంటూ ముందుకు సాగాం,” అని ఆయన తెలిపారు.
డీఎంకే సంక్షేమ పథకాలు
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కూడా స్టాలిన్ ప్రస్తావించారు. కళైంగర్ మహిళల హక్కుల పథకం, విద్యార్థులకు ‘నాన్ ముధల్వన్’, మహిళలకు ‘పుదుమై పెన్’, ‘విడియల్ ప్రయాణం’, ‘మక్కలై తేడి మరుత్తువం’, ‘ఇల్లం తేడి కల్వి’ వంటి పథకాలతో రాష్ట్రంలోని దాదాపు ప్రతి కుటుంబానికి లాభం చేకూరిందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెరగడం, అంతర్జాతీయ పెట్టుబడులు రావడం, రెండంకెలఆర్థిక వృద్ధి నమోదవడం వల్ల తమిళనాడు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు.
ఏఐఏడీఎంకేపై విమర్శలు
తమిళనాడు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లేలా చేసిన పాలన ఏఐఏడీఎంకేదేనని స్టాలిన్ విమర్శించారు. డీఎంకేకు వరుసగా పదేళ్ల పాలన ఇవ్వండి. అప్పుడు తమిళనాడును మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు పిలుపునిచ్చారు.
