
డీఆర్‌డీఓ 'ఎస్‌ఎఫ్‌డీఆర్' ప్రయోగం విజయవంతం
భారత రక్షణ రంగ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. గగనతల పోరులో శత్రువుల వ్యూహాలను చిన్నాభిన్నం చేసే 'సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (ఎస్‌ఎఫ్‌డీఆర్)’ సాంకేతికతను భారత్ మంగళవారం విజయవంతంగా ప్రదర్శించింది. ఒడిశా తీరంలోని ఐటీఆర్ చండీపూర్ వేదికగా ఉదయం 10:45 గంటలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) చేపట్టిన ఈ ప్రయోగం ఆద్యంతం విజయవంతంగా సాగింది.
నిర్దేశిత లక్ష్యం దిశగా..
ప్రయోగంలో భాగంగా ఎస్‌ఎఫ్‌డీఆర్ క్షిపణి అన్ని దశలను సమర్థవంతంగా పూర్తి చేసింది. తొలుత గ్రౌండ్ బూస్టర్ మోటార్ సాయంతో నిర్దేశిత మ్యాక్ వేగాన్ని (శబ్దం కంటే వేగంగా) అందుకున్న క్షిపణి, అనంతరం రామ్‌జెట్ ఇంజిన్‌ను మండించి లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఈ వ్యవస్థలోని కీలక విభాగాలైన నోజిల్-లెస్ బూస్టర్, ఎస్‌ఎఫ్‌డీఆర్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి ఉపవ్యవస్థలు శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా అద్భుత పనితీరును కనబరిచాయి.
బంగాళాఖాతం తీరంలో ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ప్రయోగం దిగ్విజయమైందని డీఆర్‌డీఓ ధ్రువీకరించింది. ఐటీఆర్ చండీపూర్ అందించిన ఫ్లైట్ డేటా ద్వారా క్షిపణిలోని ప్రతి విభాగం పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, రీసెర్చ్ సెంటర్ ఇమారత్, ఐటీఆర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ఏంటి దీని ప్రత్యేకత?
సాధారణ క్షిపణులకు, ఈ ఎస్‌ఎఫ్‌డీఆర్ సాంకేతికతకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే.. ఇది ప్రయాణ సమయంలో వాతావరణంలోని ఆక్సిజన్‌ను గ్రహించి ఇంధనాన్ని మండిస్తుంది. దీనివల్ల క్షిపణిలో ఆక్సిడైజర్ (ఆక్సిజన్ నిల్వలు) మోయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ఆ బరువు తగ్గిన చోట మరింత ఇంధనాన్ని నింపుకోవచ్చు. ఫలితంగా క్షిపణి బరువు గణనీయంగా తగ్గడమే కాకుండా, అత్యంత వేగంతో సుదూర లక్ష్యాలను ఛేదించే అద్భుత సామర్థ్యం దక్కుతుంది. భవిష్యత్తులో గగనతలంలో శత్రువుల అస్త్రాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా, అత్యంత శక్తివంతమైన సుదూర శ్రేణి క్షిపణుల అభివృద్ధికి ఈ ప్రయోగం బాటలు వేయనుంది
అభినందనల వెల్లువ
ఈ చారిత్రక విజయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను, ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన పరిశ్రమల ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇది గొప్ప ముందడుగని ఆయన పేర్కొన్నారు. డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ సైతం ఈ ప్రయోగంలో పాల్గొన్న బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని రక్షణ సాంకేతికతలో స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లే కీలక ఘట్టమని ఆయన అన్నారు.
