Let's talk: editor@tmv.in
డీఆర్‌డీఓ-ఇండియన్ నేవీ ‘ఏడీసీ-150’ పరీక్ష విజయవంతం

డీఆర్‌డీఓ-ఇండియన్ నేవీ ‘ఏడీసీ-150’ పరీక్ష విజయవంతం

Shaik Mohammad Shaffee
11 మార్చి, 2026

భారత నౌకాదళం తన అమ్ములపొదిలో మరో కీలక అస్త్రాన్ని చేర్చుకోబోతోంది. సముద్రం మధ్యలో ఆపదలో ఉన్న నౌకలకు, సిబ్బందికి తక్షణమే అత్యవసర సామాగ్రిని చేరవేసేందుకు ఉద్దేశించిన 'ఏడీసీ-150' (ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్) పరీక్షలు విజయవంతమయ్యాయి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), భారత నౌకాదళం సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాలను నిర్వహించాయి.

గోవా తీరంలో ప్రయోగాలు

ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 మధ్య గోవా తీరంలో ఈ పరీక్షలు జరిగాయి. నౌకాదళానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం 'పీ8ఐ' నుంచి నాలుగు పర్యాయాలు ఈ కంటైనర్‌ను గాలిలో ఉండగానే జారవిడిచారు. విభిన్నమైన, అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగాలు విజయవంతం కావడంతో నౌకాదళ లాజిస్టిక్స్ సామర్థ్యం మరో స్థాయికి చేరుకుంది.

అత్యాధునిక సామర్థ్యం.. 150 కిలోల పేలోడ్

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ కంటైనర్ 150 కిలోల బరువున్న సామాగ్రిని మోసుకెళ్లగలదు. తీరానికి వందల కిలోమీటర్ల దూరంలో, నడిసముద్రంలో విధులు నిర్వహించే నౌకలకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు.. అంటే కీలకమైన విడిభాగాలు, వైద్య పరికరాలు, మందులు లేదా ఆహారం అవసరమైనప్పుడు ఈ కంటైనర్ల ద్వారా వేగంగా సాయం అందించవచ్చు. విమానం నుంచి పారాచూట్ సహాయంతో వీటిని కిందకు జారవిడుస్తారు.

దేశవ్యాప్త శాస్త్రవేత్తల సమిష్టి కృషి

దేశంలోని పలు కీలక పరిశోధన సంస్థలు ఏకమై ఈ స్వదేశీ అద్భుతాన్ని ఆవిష్కరించాయి. విశాఖపట్నంలోని ఎన్ఎస్‌టీఎల్ ఈ ప్రాజెక్టును ముందుండి నడిపించగా, ఆగ్రాకు చెందిన ఏడీఆర్‌డీఈ సంస్థ కంటైనర్ సురక్షితంగా కిందకు దిగడానికి అవసరమైన పారాచూట్ వ్యవస్థను రూపొందించింది. అలాగే బెంగళూరులోని సెమిల్యాక్ సంస్థ ఈ ప్రయోగాలకు అవసరమైన విమాన అనుమతులు ఇవ్వగా, హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్ ప్రయోగం జరుగుతున్నప్పుడు సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించింది. ఇలా దేశంలోని వివిధ నగరాల శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే భారత నౌకాదళానికి ఈ సరికొత్త బలం చేకూరింది.

త్వరలోనే నౌకాదళంలోకి చేరిక

భారత నౌకాదళం కోరిన తక్కువ సమయంలోనే శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి, విజయవంతంగా పరీక్షించారు. అన్ని దశల్లో నిర్వహించిన అభివృద్ధి పరీక్షలు పూర్తి కావడంతో, త్వరలోనే ఈ ఏడీసీ-150 వ్యవస్థను భారత నౌకాదళంలోకి అధికారికంగా చేర్చుకోనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.