
డిసెంబర్ 6,7,8 తేదీల్లో వైభవంగా “కృష్ణవేణి సంగీత నీరాజనం”
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన “కృష్ణవేణి సంగీత నీరాజనం” కర్ణాటక సంగీతోత్సవం ఈసారి మరింత విశిష్టంగా డిసెంబర్ 6 నుంచి 8 వరకు విజయవాడలో నిర్వహించనున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వశాఖలు, సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర పర్యాటక–సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా ఉత్సవం చేపడుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్, కేంద్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు.
ఈ ఏడాది ఉత్సవ “తెలుగు సంగీత సంప్రదాయాల వైభవాన్ని వేడుకగా జరుపుకుందాం అనే థీమ్ తో తెలుగు సంస్కృతి, సంగీతం, పాక వారసత్వం, చేనేత–హస్తకళలు, సంప్రదాయాలను జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తుంది.
ఇక మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 35 ప్రదర్శనలతో పాటు 140 మంది కళాకారులు కర్ణాటక సంగీత రసరమ్యాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు. తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం ప్రధాన వేదికగా ఉండగా, డిసెంబర్ 7 ఉదయం దుర్గా ఘాట్‌లో త్యాగరాజ పంచరత్న కృతుల ప్రత్యేక గానం నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న కనకదుర్గ ఆలయంలో దేవి కృతుల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ప్రతి రోజూ వైవిధ్యభరిత ప్రదర్శనలు ఉంటాయి. డిసెంబర్ 6న నాగస్వర వాయిద్యాలు, హరికథ, గాత్రకచేరీలు, నామసంకీర్తనలు సహా 11 కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్ 7న పంచరత్న కృతులు, వాయిద్యవేదికలు అలరించగా, డిసెంబర్ 8న దేవి కృతులు, మాండలిన్ వాయిద్యం, దివ్యనామ కృతులతో 13 ప్రదర్శనలు ఉంటాయి.
ఉత్సవానికి ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కచేరీలు నిర్వహించారు. నవంబర్ 29న శ్రీకాళహస్తి, డిసెంబర్ 1న సింహాచలం, డిసెంబర్ 2న శ్రీశైలంలో సంగీత కార్యక్రమాలు జరిగి ప్రజల్లో ఉత్సవ చైతన్యం పెంచాయి.
జౌళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిఐ ఉత్పత్తులు, చేనేత–హస్తకళల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మంగళగిరి కాటన్, ఉప్పాడ జంథాని, ధర్మవరం సిల్క్, పోచంపల్లి ఇకత్‌తో పాటు కొండపల్లి బొమ్మలు, కలంకారి, నర్సాపురం లేస్, తోలుబొమ్మలు ప్రదర్శనలు జరగనున్నాయి. ఇవి ‘వోకల్ ఫర్ లోకల్’ లక్ష్యానికి అనుగుణంగా కళాకారులకు నేరుగా మార్కెట్ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పాక సంపదను ప్రతిబింబిస్తూ తిరుపతి ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయనుంది.
సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఎకో, టెంపుల్, అడ్వెంచర్, వెల్‌నెస్, క్రూయిజ్, రీజినల్ సర్క్యూట్‌ల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
కార్యక్రమానికి కేంద్ర మంత్రి సురేష్ గోపి ముఖ్య అతిథిగా హాజరవుతారు. గౌరవ అతిథులుగా మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, పర్యాటక కార్యదర్శి వినయ్ చంద్ తదితరులు పాల్గొననున్నారు. అదేవిదంగా దేశ–విదేశాల్లోని సంగీత అభిమానుల కోసం ఉత్సవాన్ని పర్యాటక మంత్రిత్వశాఖ యూట్యూబ్ ఛానల్ @ministryoftourismgoi ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
సంగీతం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే “కృష్ణవేణి సంగీత నీరాజనం” ఈ ఏడాది సంగీతం అభిమానులందరూ తప్పక చూడవలసిన అద్భుత సాంస్కృతిక మహోత్సవంగా నిలవనుంది.
