Let's talk: editor@tmv.in
డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారత పర్యటన

డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారత పర్యటన

Shaik Mohammad Shaffee
29 నవంబర్, 2025

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ వచ్చే నెల డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఇది ప్రభుత్వ అధికారిక పర్యటన అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో పుతిన్, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పుతిన్‌ను రాష్ట్రపతి భవన్‌లో కలుసుకుని, ఆయన గౌరవార్థం విందు ఇవ్వనున్నారు.

ఈ పర్యటన ద్వారా భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు, ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఏర్పడుతుందని ఎంఈఏ పేర్కొంది. అలాగే, రెండు దేశాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించనున్నారని తెలిపింది.

రష్యా కూడా పుతిన్ పర్యటనకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. రష్యా అధ్యక్ష భవనం (క్రెమ్లిన్) ఈ పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొంది. రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక, మానవీయ రంగాలలో అత్యంత విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్రంగా చర్చించడానికి ఇది ఒక మంచి అవకాశం అని తెలిపింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందంతో జరిగే చర్చల్లో ఈ అంశాలు ప్రధానంగా ఉంటాయని క్రెమ్లిన్ తెలిపింది.

వార్షిక సదస్సు కోసం ఇరు దేశాల మధ్య సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా మాస్కోలో పుతిన్‌ను కలసి, మోడీ శుభాకాంక్షలను తెలియజేశారు. వార్షిక సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ సంబంధాల పురోగతిపై పుతిన్ సూచనలు ఎంతో విలువైనవని అన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా పుతిన్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల రష్యా అధ్యక్షుడి సలహాదారు పత్రుషేవ్, భారత ప్రధాని మోడీని కలసి సముద్ర భద్రత సహా వివిధ రంగాల్లో సహకారం పట్ల చర్చించారు. భారత్-రష్యా 2000 సంవత్సరంలో వ్యూహాత్మక భాగస్వామ్య ప్రకటనపై సంతకం చేశాయి, దీని ద్వారా వార్షిక శిఖరాగ్ర సమావేశాలకు వేదిక ఏర్పడింది. 2010లో ఈ సంబంధం "ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం" స్థాయికి పెరిగింది.

2021 తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. గత ఏడాదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు రెండుసార్లు భేటీ అయ్యారు. 2024 జూలై నెలలో ఇరు దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని మోడీ రష్యాకు వెళ్లారు. ఆ సమయంలో మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను ప్రదానం చేశారు. ఆ తరువాత, అదే సంవత్సరం అక్టోబర్‌లో, బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్‌లో వీరిద్దరూ మరోసారి సమావేశమయ్యారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 1న చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు చివరిసారిగా నేరుగా కలుసుకున్నారు.

డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారత పర్యటన - Tholi Paluku