Let's talk: editor@tmv.in
డిసెంబర్ 26 నుంచి రైల్వే ఛార్జీల పెంపు

డిసెంబర్ 26 నుంచి రైల్వే ఛార్జీల పెంపు

Pinjari Chand
22 డిసెంబర్, 2025

పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేయడంతో పాటు ప్రయాణికులపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో భారత రైల్వేలు ప్రయాణికుల ఛార్జీలను సవరించినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ సవరించిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. రైల్వే శాఖ ప్రకారం ఈ ఛార్జీల సవరణలో రోజువారీ ప్రయాణికులకు ఉపశమనం కలిగేలా పలు మినహాయింపులు ఇచ్చింది. సబర్బన్ రైలు సర్వీసులకు ఎలాంటి ఛార్జీ పెంపు ఉండదని, అలాగే మంత్లీ సీజన్ టికెట్ (ఎంఎస్టీ) ప్రయాణికులకు కూడా టికెట్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

అదేవిధంగా, సాధారణ తరగతిలో 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ప్రయాణికులకు కూడా ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని రైల్వేలు వెల్లడించాయి. అయితే 215 కిలోమీటర్లకు మించిన ప్రయాణాలకు ఛార్జీల్లో స్వల్ప పెంపు ఉంటుందని తెలిపాయి. సాధారణ తరగతిలో ప్రతి కిలోమీటరుకు 1 పైసా చొప్పున ఛార్జీ పెరుగుతుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల నాన్-ఏసీ కోచ్‌లకు ప్రతి కిలోమీటరుకు 2 పైసలు పెంపు ఉంటుంది. ఏసీ తరగతులన్నింటికీ కూడా ప్రతి కిలోమీటరుకు 2 పైసలు చొప్పున ఛార్జీ పెరుగుతుందని రైల్వే శాఖ తెలిపింది.

రూ.600 కోట్ల అదనపు ఆదాయం

ఈ పెంపు వల్ల ప్రయాణికులపై పడే ఆర్థిక భారం చాలా పరిమితంగానే ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉదాహరణకు, 500 కిలోమీటర్ల నాన్-ఏసీ ప్రయాణానికి కేవలం రూ.10 మాత్రమే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఛార్జీల సవరణ ద్వారా రైల్వేలకు సంవత్సరానికి సుమారు రూ.600 కోట్ల అదనపు ఆదాయం లభించనున్నట్లు అంచనా వేసింది. ఇదే సమయంలో రైల్వేల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని వివరించింది. భద్రతా చర్యలు, సిబ్బంది నియామకాల కారణంగా మానవ వనరుల వ్యయం దాదాపు రూ.1.15 లక్షల కోట్లకు చేరిందని, పింఛన్ వ్యయం రూ.60,000 కోట్లకు పెరిగిందని, 2024–25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం నిర్వహణ ఖర్చు రూ.2.63 లక్షల కోట్లుగా అంచనా వేశామని రైల్వే శాఖ వివరించింది.

ఈ చర్యల ఫలితంగా రైల్వే భద్రత, సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం భారత రైల్వేలు ప్రపంచంలో రెండో అతిపెద్ద సరుకు రవాణా రైల్వే వ్యవస్థగా ఎదిగాయని వెల్లడించింది. ఇటీవలి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు 12,000కు పైగా ప్రత్యేక రైళ్లు నడిపినట్లు రైల్వే శాఖ తెలిపింది. భవిష్యత్తులోనూ సామర్థ్య వృద్ధి, ఖర్చుల నియంత్రణ, నిర్వహణ సంస్కరణలపై దృష్టి సారిస్తూ, ప్రజలకు చౌకగా, సులభంగా అందుబాటులో ఉండే రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా భారత రైల్వేలు పనిచేస్తాయని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గతంలో ఇదే ఏడాది జూలైలో కూడా చార్జీలను రైల్వే శాఖ పెంచింది.