
డిసెంబర్ నెలాఖరుకు అక్రిడిటేషన్స్ ఇవ్వాలి
డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలో జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియ పూర్తి చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏపిఎంఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీబాబురెడ్డి హెచ్చరించారు. ఏపిఎంఎఫ్ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం విజయవాడలో ఫెడరేషన్ సమన్వయకర్త బి. సతీష్ బాబు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ఢిల్లీబాబు రెడ్డి మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఉండేవని, వైసీపీ హయాంలో అక్రిడిటేషన్లను 9 వేల మందికే ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పని చేసే జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తయినా వైసీపీ హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లనే రెన్యూవల్ చేస్తున్నారే తప్ప కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఏపిఎంఎఫ్ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టామని, 2026 జనవరి నెలాఖరు వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేసి ఏపిఎంఎఫ్ సభ్యులందరికి గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తామని ప్రకటించారు.
జిల్లాల వారీగా ఏపీఎంఎఫ్ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు ఢిల్లీబాబు రెడ్డి తెలిపారు. ఏపిఎంఎఫ్ కు అనుబంధంగా చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం పని చేస్తుందని, త్వరలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీబాబు రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పని చేసే ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఇవ్వాలని, జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యం పెంచేందుకు శిక్షణా తరగతులు అవసరం అని, అయితే ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని యూనియన్ల సభ్యులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ప్రభుత్వానికి ఏపిఎంఎఫ్ తరపున ఫిర్యాదు చేయనున్నట్లు ఢిల్లీబాబు రెడ్డి తెలిపారు.
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మాజీ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత మన రాష్ట్రంలోని జర్నలిస్టుల కోసం ఆవిర్భవించిన ఏపిఎంఎఫ్ ను బలోపేతం చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. పలు రాష్ట్రాల్లో బలమైన జర్నలిస్టు యూనియన్లు ఏపిఎంఎఫ్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని, త్వరలో ఆయా రాష్ట్రాల యూనియన్లతో చర్చించి జాతీయ స్థాయి యూనియన్ ఒకటి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చొల్లంగి అప్పాజీ (బి.ఆర్.కె న్యూస్ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్), రాష్ట్ర కార్యదర్శులుగా సత్య (టీవీ 9 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్), డోలా అప్పన్న (శ్రీకాకుళం), సురేందర్ రెడ్డి(తిరుపతి), సోమశేఖర్ (చిత్తూరు), డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా కాకర సుధీర్ (ఏబిపి దేశం ఉమ్మడి తూర్పుగోదావరి), విశాఖపట్నం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా పి. శంకరరావులను నియమిస్తున్నట్లు ఏపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఢిల్లీబాబు రెడ్డి ప్రకటించారు.
ఈ సమావేశంలో ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ (విశాఖపట్నం), మల్లికార్జున్ (నెల్లూరు), బాలాజీ యాదవ్ (చిత్తూరు), ఉదయ్ భాస్కర్(ఏలూరు), కాకర సుధీర్ (అంబేద్కర్ కోనసీమ), రాష్ట్ర కార్యదర్శి డోలా అప్పన్న, బాపట్ల ప్రతినిధి వైఎస్ రావు తదితరులు ప్రసంగించారు.
