
డిసెంబర్‌లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో నిర్వహించబడుతుంది.ఈ ఫెస్టివల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ కార్యక్రమలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం నిర్వహణకు రూ.30 లక్షల వ్యయం అంచనా వేయగా, ఆ నిధులు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల నుంచే వినియోగించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సినీ రంగంలో యువ ప్రతిభను వెలికితీసేందుకు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న యువ దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించేందుకు “యంగ్ ఫిల్మ్‌మేకర్స్ అవార్డ్స్” కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ అవార్డుల నిర్వహణకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ కమిటీ చైర్మన్‌గా దర్శకుడు దశరథ్ నియమితులయ్యారు. సభ్యులుగా హరీష్ శంకర్ (ప్రముఖ దర్శకుడు), బలగం వేణు (దర్శకుడు, నటుడు), పీ.జీ. విందా (జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్), రాహుల్ సిప్లిగంజ్ (ప్రముఖ గాయకుడు), చరణ్ అర్జున్ (దర్శకుడు), ఎల్. లక్ష్మి (రచయిత్రి, దర్శకురాలు), అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సభ్యులు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర యువ ఫిల్మ్‌మేకర్స్‌కు కొత్త ఉత్సాహం నింపనుంది. అవార్డుల ద్వారా వారు సృజనాత్మకతను ప్రదర్శించుకునే వేదిక లభించనుందని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. “సినీ రంగానికి తెలంగాణ కొత్త ఊపిరినిస్తోంది. యువ ప్రతిభకు వేదికలు సిద్ధమవుతున్నాయి.అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
