Let's talk: editor@tmv.in
డిసెంబర్‌లోనే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు

డిసెంబర్‌లోనే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు

Pinjari Chand
26 నవంబర్, 2025

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం అధికారిక షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో—డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత, ప్రధాన రాజకీయ పార్టీలకు ఇవి మరోసారి ప్రజాదరణకు లిట్మస్ పరీక్షగా మారనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగుతున్నప్పటికీ, రాజకీయపరంగా ఇవి అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 12,728 సర్పంచ్ పదవులు, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

1.66 కోట్ల మంది ఓటర్లు

రాష్ట్రంలో 1.66 కోట్లు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు – 81,42,231, మహిళలు – 85,12,455 ఉన్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో గ్రామాలు , వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కమిషనర్ తెలిపారు. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు.

గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రద్దు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విడుదల చేసిన రెండు నోటిఫికేషన్‌లను సవరించి/రద్దు చేస్తూ కొత్త ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243-కే, తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం–2018లోని సంబంధిత నిబంధనలు ఆధారంగా తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

పాత నోటిఫికేషన్‌లు నిలిపివేత

29.09.2025న విడుదల చేసిన నోటిఫికేషన్ నెం. 660/TGSEC-PR/2023-1 (గెజిట్ నెం. G-761/1లో ప్రచురితమైనది)

09.10.2025న జారీ చేసిన నోటిఫికేషన్ నెం. 660/TGSEC-PR/2023-4

ఈ రెండు నోటిఫికేషన్‌లను ఎన్నికల సంఘం ప్రస్తుతం సవరించి/రద్దు చేసింది.

మొదటి దశ

నవంబర్‌ 27 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభం. 29 వరకూ నామినేషన్లు, 30న పరిశీలన. డిసెంబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు ఉపసంహరణకు గడువు. అదే రోజు పోటీ అభ్యర్థుల జాబితా విడుదల. డిసెంబర్‌ 11వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకూ పోలింగ్.

రెండో దశ

నామినేషన్లు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 2 వరకూ. డిసెంబర్‌ 3న పరిశీలన, 6 వరకూ ఉపసంహరణకు గడువు. అదేరోజు అభ్యర్థుల జాబితా ప్రకటన. డిసెంబర్‌ 14 పోలింగ్.

మూడో దశ

డిసెంబర్‌ 3 నుంచి 5 వరకూ నామినేషన్లు. తరువాత పరిశీలన 6న. 9 వరకూ ఉపసంహరణ. అదే రోజు అభ్యర్థుల జాబితా. డిసెంబర్‌ 17 పోలింగ్‌ నిర్వహిస్తారు.

ఉపసర్పంచ్‌ ఎన్నిక

గ్రామ సర్పంచ్‌ ఎన్నిక ఫలితాలు వెలువడిన రోజునే ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. ఆ రోజు ఎన్నిక జరగని పక్షంలో.. మరుసటి రోజు తప్పనిసరిగా నిర్వహిస్తారు.

బీసీ రిజర్వేషన్ వివాద ప్రభావం

సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ఐదు విడతల్లో షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును హైకోర్టు అక్టోబర్ 9న నిలిపివేయడంతో, ఆ నోటిఫికేషన్ మొత్తం నిలిచిపోయింది. తదనంతరం చట్టపరమైన అంశాలు పరిష్కారం కానందున, ప్రభుత్వం నవంబర్ 17న గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తర్వాతకు వాయిదా వేయాలని నిర్ణయించింది. గతంలో 2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పటి సర్పంచ్ ల పదవీకాలం 2024లోనే ముగిసినా.. తెలంగాణ ప్రభుత్వం తాత్సరం చేస్తూ వచ్చింది. దీంతో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో పల్లెల్లో పరిపాలన సాగింది.