
డియర్ పేరెంట్స్.. కాస్త ఆలోచించండి!
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు తమకంటే గొప్ప స్థానానికి చేరుకోవాలి అనుకునే వాళ్ళే.కానీ ప్రస్తుత సమాజంలో అది ఎంతవరకు సాధ్యమవుతుంది. ప్రతీ ఇల్లు స్వర్గంగా వుండాలన్నా లేక నరకంగా మారాలన్నా దాని పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. ఉమ్మడి కుటుంబాలలో ముందు తరాల వాళ్ళు ప్రతీ మంచిచెడుల్లో చేదోడుగా వాదోడుగా ఉండేవారు. కానీ ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ కొత్త పోకడలు బందుత్వాలకి తిలోదకాలు ఇచ్చేసి ఒంటరి జీవితాలు కావాలంటూ వేరు కాపురాల మోజులో పడి కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
మంచికి చెడుకు మధ్య ఉన్న సన్నని పొర వాళ్లకు అర్థమయ్యే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ గందరగోళ జీవితంలో ప్రతిదీ ఆర్ధిక సమస్యతోనే మొదలవుతుంది. ఆడా,మగా కలిసి కష్టపడితేనే సుఖమయ జీవితంవస్తుందనే అపోహ మొదలయ్యి కుటుంబ జీవితాలని రోడ్డుమీద పడేలా చేసుకుంటున్నారు. డబ్బుతో కొనలేనివి ఏమీలేవు అనుకుంటున్నారు కానీ డబ్బు ఇవ్వలేని కొన్ని సరదాలు సంతోషాలు వున్నాయి అలాగే కొన్ని డబ్బుతో వచ్చిన సరదాలు జీవితాన్ని అంధకారంలో పడేస్తున్నాయని గ్రహించడం లేదు. మానవతా విలువలకు తిలోదకాలు ఇచ్చి ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతున్నారు. దీనివల్ల పిల్లలపై మమకారం అనుకునే గారాబం
చూపిస్తూ వారికి కావలసినవి సమకూర్చడమే తమ బాధ్యత అనుకుంటున్నారు. పిల్లలకు ప్రేమ పంచి మంచిచెడులు నేర్పాల్సిన తరుణాన్ని వదిలేసి పిల్లలు చెయ్యిదాటి పోయాక బాధపడి ఏం ప్రయోజనం.
ఈ మధ్యే తెలంగాణాలో జరిగిన ఉదంతాలు ప్రతి తల్లిదండ్రులకు ఓ చెంపపెట్టుగా మారాయి.. ఓ పదవతరగతి అమ్మాయి ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపడమేంటి? మరో ఘటనలో పదవతరగతి చదివే అబ్బాయి పక్కింటి ముక్కు పచ్చ లారని పసిపాపను నిర్దక్షణ్యంగా పొడిచి చంపడమేంటి? ఎటుపోతుందీ సమాజం? ఎటు పోతుందీ పసిపిల్లల భవితవ్యం? ఈ ప్రశ్నలు ప్రతీ బార్యా భర్తలు తల్లితండ్రులు అవ్వక ముందే వేసుకోవాలేమో!
ఒంటరితనం
వయసులో వున్న ఆడపిల్లకి తల్లి అవసరం ఎంత వుందో అబ్బాయికి కూడా అంతే అవసరం వుంటుంది . ఈ వయసులోనే పిల్లలకు మానసిక బావనలు కలుగుతాయి . వయసుతో వచ్చే మార్పులు స్నేహాన్ని కోరుకుంటాయి.ఆ సమయంలోనే పిల్లలకి తోడుగా నిలబడ్డప్పుడే వారు ప్రయోజకులవుతారు . లేదంటే చేజారిపోతారు. ప్రతీ మధ్య తరగతి తల్లిదండ్రులు తమపిల్లలు ఎంతో విలాసంగా బతకాలని కోరుకునేవారే. అందుకే తల్లిదండ్రులు కష్టమైనా ఏదో ఒక ఉపాదిమార్గం ఎంచుకుంటే పిల్లల్ని బాగా చదివించొచ్చు అనుకుంటున్నారు.తల్లిదండ్రులు ఇద్ధరు సంపాదనలో పడి కుటుంబ జీవితానికి నీళ్ళొదిలేస్తున్నారు. దీనితో పిల్లలు పాలుగారే పసివయసు నుండే ఒంటరితనానికి చేరువవుతున్నారు. డబ్బులు ఖర్చుపెట్టి పిల్లల్ని క్రష్ లో వేస్తున్నాం. లక్షల్లో వెచ్చించి ప్రీ కేజీ లో వేస్తున్నాం, పెద్ద పెద్ద విద్యాసంస్థలు లో వేసి సుఖ పెడుతున్నాం అనుకుంటున్నారు. కానీ బాల్యాన్ని క్రష్ లో వేసి నలిపేస్తున్నాం అనుకోవడంలేదు .అక్కడ ఉన్న ఆయాలు , టీచర్లు అమ్మనాన్నలవుతారా.పిల్లల ముద్దు మాటల్ని ,చిలిపి చేష్టల్ని కోల్పోతున్నాం అన్న భావన ఏ కోసానా ఉండలేదు. ఇదే పిల్లల భవితవ్యాన్ని చిందరవందర చేస్తుంది అని గ్రహించలేకపోతున్నారు.."మొక్కై వంగనిది మానై వంగుతుందా" మీరే చెప్పండి.
కోల్పోయిన బాల్యం లో వాళ్ళకి ఒంటరితనం కనిపిస్తుంది,మంచి చెడుల విలువలు చెప్పే వారు తోడులేక నచ్చిన మార్గంలో పయనిస్తూ చెడుమార్గానికి చేరువైపోతున్నారు. ఇది పిల్లలు చేజారాక గాని తల్లిదండ్రులు గుర్తించడంలేదు.దీనికి ఎవరు బాధ్యులు? తాము కష్టపడినా పిల్లలు సుఖ పడాలనుకనే తల్లిదండ్రులదా. పెద్ద పెద్ద విద్యాసంస్థలు పెట్టి లక్షల్లో ఫీజులు వసూలు చేసి జ్ఞానాన్ని నింపాల్సిన విద్యాసంస్థల నిర్లక్షానిదా.ఎవ్వరికీ దొరకని సమాధానం ఇది. డబ్బులు సుఖమయ జీవితాన్ని ఇవ్వొచ్చు కానీ మంచి దిశా నిర్దేశాన్ని చెయ్యలేవు. పెద్దల తోడు అనేది కావలసిన సమయంలో అందించకపోవడమే ఈ పరిస్థితికి కారణం. అమ్మమ్మ చెప్పే నీతి కథలు ,తాతయ్యలు చెప్పే మంచి సూక్తులు.మళ్ళీ రావాలి.
మనల్ని ఒకరు గమనిస్తున్నారు అనే భయం పిల్లల మనసుల్లో ఒక మూల వాళ్ళు జాగ్రత్తగా ఉండేటట్లు చేస్తుంది. అది వారికి నమ్మకాన్ని, భరోసాని ఇస్తుంది. అలాంటి వాతావరణాన్ని కల్పించగలిగితే పిల్లలు చెయ్యి దాటిపోరు,భయము ,భక్తి ,ప్రేమ సమపాళ్ళలో ఉన్నప్పుడే ఈ సమాజం ఇలాంటి రుగ్మతల నుండి బయట పడుతుంది. "పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" పిల్లలు ఉన్నతి తల్లిదండ్రులు ఇచ్చే పెంపకం మీదే అది ఆధారపడి వుంటుంది" పుత్రోత్సాహము పుత్రుడు పుట్టి నప్పుడు కాదు ఆపుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడే” అనే నానుడి నిజమవ్వాలి అంటే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పిల్లలపై ఎప్పుడూ ఉండాలి.
ఒక డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వాలి ,ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీరే అవ్వాలనిలేదు. పిల్లలకి కొన్ని కలలుంటాయి . వాటిని గుర్తిస్తే వాళ్ళు కోరుకున్న రంగాన్ని వారికి పరిచయం చేస్తే ఒక క్రీడా రంగంలో సచిన్ లా ,టెక్నాలజీ లో ఒక అబ్దుల్ కలాం లా జాతి గర్వించే ముద్ధు బిడ్డలు అవుతారు. అంతేకాని మీ ఇష్టాలను వారిపై రుద్ధితే మానసిక సంఘర్షణకు లోనై వ్యసనాలకు బానిసలై మనకు బారమవుతారు.
ప్రస్తుత పోకడలు పిల్లలు స్వతంత్రతను ప్రోత్సహిస్తున్నాయి. తల్లిదండ్రులు వారికి స్వతంత్రతను ఇచ్చినట్టే కనిపించాలి కానీ ప్రతి అమ్మానాన్న వారికి నీడలా గమనించాల్సిందే. మనం పిల్లలకు ఏమిస్తే పిల్లలు మనకు అదే ఇస్తారు బంధాలు ఇస్తే బంధాలు, ఒంటరి తనమిస్తే ఒంటరితనం. చదువులు పేరు చెప్పి హాస్టల్ లోకి వేస్తే పెద్ద అయ్యాక మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వెయ్యడం తప్పు కాదనుకుంటారు. కాబట్టి పిల్లల్ని ప్రేమతో పెంచండి. ప్రేమను వారికి పంచండి. చిన్నతనం నుండే మంచి మార్గానికి బాటలువెయ్యండి. అందరికీ చదువు కావాలి కానీ అది సంస్కారవంతమైన జ్ఞానాన్నిఇచ్చేలా ఉండాలి. ఓసారి ఆలోచించండి.
