
డిప్రెషన్‌లో చిక్కిన బాల్యం
పిల్లలకు జ్వరమొస్తే ఆస్పత్రికి తీసుకెళ్తాం.. పిల్లల శరీరానికి గాయమైతే వెంటనే ట్రీట్‌మెంట్ చేస్తాం.. ఇదంతా శరీరానికి సంబంధించిన విషయాలు.. మరి పిల్లల మనసుకు దెబ్బతగిలితే తల్లిదండ్రులు, టీచర్లు ఏం చేస్తున్నారు? అసలు పిల్లల మానసిక స్థితి సరిగ్గా ఉందో లేదో ఆలోచిస్తున్నామా? ఫిజికల్ హెల్త్‌పై ఉండే శ్రద్ధ, అవగాహన మెంటల్ హెల్త్‌పై ఎందుకు ఉండడంలేదు? పిల్లలు మానసిక ఒత్తిడిలో చితికిపోవాల్సిందేనా? బాధలు బయటకు చెప్పుకోలేక లోలోపల కుంగిపోవాల్సిందేనా? నగరాల్లో ఉంటున్న ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు మానసిక సమస్యలు భరిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. అందులో సగం మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఇంకొంతమంది యాంగ్జైటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే అన్నిటికంటే బాధకరమైన విషయం ఏంటంటే.. పిల్లలు ఎవరూ కూడా ఈ సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకోవడం లేదు. ఎందుకంటే వాళ్లు పడుతున్న బాధకు పేరు కూడా వారికి తెలియదు. దీనికి కారణం మెంటల్ హెల్త్‌పై అవగాహన లేని విద్యావ్యవస్థలే కావొచ్చు. మరి ఏం చేయాలి? మన పిల్లలను మనం ఎలా కాపాడుకోవాలి?
నిజానికి నగరాల్లోని విద్యార్థుల జీవితం బయటకు చూస్తే అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం వారిని ఒత్తిడి, ఆందోళన వేధిస్తుంటుంది. మంచి మార్కులు, మంచి కాలేజీ, మంచి జాబ్ కోసం పోటీ పడుతూ వాళ్లు తమ మనసును మర్చిపోతున్నారు. సోషల్ మీడియా కూడా ఇందులో భాగమైంది. ప్రతి లైక్, ప్రతి కామెంట్, ప్రతి ఫొటో వెనక వాళ్లు మానసికంగా అలసిపోతున్నారు. ఇంకొందరు రీల్స్‌కి, షార్ట్స్‌కి అలవాటు పడిపోతున్నారు. అవుట్ డోర్ గేమ్స్‌ని పక్కన పెట్టి మొబైల్ గేమ్స్‌కి ప్రాధాన్యతనిస్తున్నారు. ఇంట్లో చాలామంది పిల్లలు ఫోన్‌కి అత్తుకుపోయి కనిపిస్తున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో అడీక్షన్‌కి దారితీస్తుంది. అదేపనిగా మొబైల్‌ను చూడడం వల్ల చదువు, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఏకాగ్రత తగ్గిపోతుంది. ఇక్కడ తల్లిదండ్రులు చేసే పొరపాటు కూడా ఒకటి ఉంది.
పిల్లలను ఫోన్ నుంచి డైవర్ట్ చేయడానికి ఎన్నో మార్గాలుంటాయి. ఇదంతా మెంటల్ హెల్త్‌కి సంబంధించిన అంశం. అయితే ఈ విషయాలపై దృష్టిపెట్టాల్సిన పెద్దలు.. ఆ పని చేయకపోగా పిల్లలపై నోరు పారేసుకుంటారు. మరో విడ్డూరమైన విషయం కూడా ఉంది. ఇంట్లో ఉన్న పెద్దలు అదేపనిగా ఫోన్ వాడుతూ కూర్చుని.. పిల్లలను ఫోన్ వాడవద్దని మందలిస్తే అది హిపోక్రసీ అవుతుంది. 'మీరు చేస్తే తప్పు కాదు కానీ మేం చేస్తే తప్పా' అనే ఆలోచన వారి మైండ్‌లో పుడుతుంది. మనం పిల్లలతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నామో కూడా చూసుకోవాలి. పెద్దలను చూసే పిల్లలు ఎక్కువగా నేర్చుకునే అవకాశముంటుంది. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి పిల్లల మానసికస్థితిని దెబ్బతీస్తుంది.
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనం ఈ పరిస్థితిని బహిర్గతం చేసింది. దేశంలోని 8 పెద్ద నగరాల్లో దాదాపు 1,600మంది విద్యార్థులను పరిశీలించారు. వారిలో 70శాతం మంది యాంగ్జైటీతో, 60శాతం మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారని తేలింది. వాళ్లలో చాలామంది తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నారు. ఇంకొందరికి జీవితం మీదే ఆసక్తి తగ్గిపోతోంది. ఎందుకు బతుకుతున్నామో ఏమో అనే ఆలోచన చిన్నతనంలోనే పుడితే ఎంత బాధాకరమో మీరే ఆలోచించండి. ఇది కేవలం కొన్ని సంఖ్యలు కాదు.. మన విద్యా వ్యవస్థలోని లోతైన సమస్యలకు అద్దం పట్టే వాస్తవాలు.
మరో విషాదకరమైన విషయం కూడా ఉంది. మన సమాజంలో ఆడవాళ్లంటే చిన్నచూపు ఉంటుంది. ఆడపిల్లలను తక్కువగా చూసే వారు మన కళ్లముందే తిరుగుతుంటారు. వారిపై సమాజం పరంగా చాలా ఒత్తిడి ఉంటుంది. ఏ డ్రెస్ వేసుకోవాలి, నువ్వు ఎందుకు అలా నవ్వుతున్నావ్.. ఆడపిల్లలు అలా తినకూడదు లాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అందుకే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా మానసిక సమస్యలకు గురవుతున్నారు. స్టూడెంట్స్ పరంగా చూస్తే బాలికలే ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని రిపోర్టు స్పష్టం చేసింది. తమ భావాలను బయటపెట్టడానికి బాలికలు భయపడుతున్నారు. ఇక ఈ సమస్య తెలిసినా కూడా చాలా మంది విద్యార్థులు సహాయం కోరడం లేదు. ఎందుకంటే మన సమాజంలో ఇంకా మెంటల్ హెల్త్ అనే మాటను సిగ్గుగా, తక్కువగా చూస్తారు. మానసిక సమస్యలున్న వారిని గుర్తించేందుకు చాలా కాలేజీల్లో కౌన్సిలర్లు కూడా ఉండరు. అందుకే ఎవరికీ చెప్పుకోలేక పిల్లలు మౌనంగా బాధపడుతున్నారు. అయితే కొన్ని ప్రముఖ సంస్థలు విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు, యాప్‌లు, కౌన్సెలింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇది మంచి సంకేతం. కానీ ఓవరాల్‌గా చూస్తే చాలా స్కూళ్లు, కాలేజీల్లో అసలు ఈ తరహా వ్యవస్థలు అందుబాటులో లేనే లేవు.
ఇక చివరగా తల్లిదండ్రులైనా, టీచర్లైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. మంచి మార్కులు, పెద్ద ఉద్యోగాలు, లేదా టాప్ ర్యాంకులు జీవితానికి అర్థం కావు. పిల్లలు ఆనందంగా ఉండాలి.. ధైర్యంగా తిరగాలి. మనసు బలంగా ఉండాలి.. అది నిజమైన విజయం. ముందుగా పిల్లలు చెప్పే ప్రతీ విషయాన్ని వినడం నేర్చుకోవాలి. ఎవరైనా తమ బాధలు చెబుతున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా, ఏమీ జడ్జ్ చేయకుండా వినడం చాలామందికి తెలియని విషయం. మీ పిల్లలు మీతో గంట సేపు ఆగకుండా మాట్లాడుతున్నా విసుగు లేకుండా వినాలి. అప్పుడే మనం వారి పట్ల కేర్ చూపిస్తున్నామని అర్థమవుతుంది. అప్పుడే వారు ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటారు. వారి మనసులో మాట చెబుతారు. మనం వింటాం. మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు ఈ బాధలు తగ్గిపోతాయి. ప్రతి విద్యార్థి ముఖంలో మళ్లీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అది మీ పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదు.. అదే మన బలం కూడా.
