Let's talk: editor@tmv.in
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం

Gaddamidi Naveen
12 జులై, 2026

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ముంబైలో శనివారం కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. గతంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయన రెండు భుజాల్లోని రొటేటర్ కఫ్ కండరాలకు తీవ్ర గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేపట్టారు.

ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజంలో అవల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉండటంతో సంక్లిష్ట శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినట్లు జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు సుమారు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వెల్లడించారు.

శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన అనస్థీషియా ప్రభావం నుంచి కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరో భుజానికి సంబంధించిన శస్త్రచికిత్సను రెండు నెలల తర్వాత నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజాలకు గాయాలయ్యాయి. అనంతరం రాజకీయ కార్యక్రమాలు, పోరాట యాత్రలు, ప్రజా పర్యటనలు, అభిమానులతో కరచాలనాలు, ఆప్యాయంగా హత్తుకునే సందర్భాల్లో గాయాలు మరింత తీవ్రమయ్యాయి. అయినప్పటికీ ఆయన నొప్పిని భరిస్తూ ప్రజల్లోనే కొనసాగారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో రెండు భుజాల్లో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీలు, కండరాల చీలికలు తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా విధుల్లోకి రావాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
PawanKalyanDeputyCMPawanKalyanGetWellSoonPawanKalyanJanaSenaAndhraPradeshPawanKalyanHealthUpdateShoulderSurgeryRotatorCuffSurgery
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం - Tholi Paluku