Let's talk: editor@tmv.in
డిప్యూటీ సీఎంగా కొనసాగడానికి సంతోషంగా ఉన్నా: డీకే శివకుమార్

డిప్యూటీ సీఎంగా కొనసాగడానికి సంతోషంగా ఉన్నా: డీకే శివకుమార్

Pinjari Chand
25 డిసెంబర్, 2025

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు డీకే తెరదించారు. తాను ఉపముఖ్యమంత్రిగా ఉండటానికి సంతోషమేనని ఆయన మీడియా ముందు చెప్పారు. దీంతో నాయకత్వ మార్పులు, తదితర ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఖండించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేసిన ఆయన, తాను డిప్యూటీ సీఎంగా కొనసాగడానికే సంతోషంగా ఉన్నానన్నారు. న్యూఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్, కాంగ్రెస్ హైకమాండ్‌ను కలుస్తున్నానన్న వార్తలు, అంతర్గత భేదాభిప్రాయాల ప్రచారం అంతా మీడియా సృష్టేనని వ్యాఖ్యానించారు.

నేను ఏఐసీసీ హైకమాండ్‌లో ఎవరినీ కలవడం లేదు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగడం నాకు ఆనందంగా ఉంది. నేను పార్టీ కార్యకర్తగా ఉండటాన్నే ఇష్టపడుతున్నాను అని ఆయన స్పష్టం చేశారు.

నా నాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడు

పదవి మార్పు లేదా రొటేషన్ ముఖ్యమంత్రి వ్యవస్థపై వస్తున్న ప్రశ్నలకు స్పందిస్తూ, ఎలాంటి పేర్లను ఊహాగానంగా ప్రస్తావించొద్దని సూచించారు. నాయకత్వంపై నిర్ణయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీదే. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరిస్తాను అని చెప్పారు. ప్రియాంకా గాంధీ పాత్ర లేదా ఆమె ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ, ఈ విషయాలపై నాకు అవగాహన లేదు. నా నాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడు. లోక్‌సభలో నా నేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు.

వాయు కాలుష్యం వంటి అంశాలపై వ్యాఖ్యానించడానికి శివకుమార్ నిరాకరించారు. అలాగే కర్ణాటకలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ప్రశ్నించగా, ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను సంప్రదించాలని సూచించారు. తాను ఢిల్లీకి రావడం పూర్తిగా పరిపాలనా సంబంధిత పనుల కోసమేనని, రాజకీయ కారణాలు లేవని డిప్యూటీ సీఎం మరోసారి స్పష్టం చేశారు. అంతకుముందు రోజు కూడా కేంద్ర మంత్రులను కలసి సాగునీటి, పట్టణాభివృద్ధి వంటి రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు మాత్రమే వచ్చానని ఆయన తెలిపారు. నేను రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదు. ప్రస్తుతం అజెండాలో లేని రాజకీయ అంశాలపై వ్యాఖ్యానించదలచుకోలేదని అన్నారు.

కర్ణాటక ప్రభుత్వం తన పదవీకాలంలో సగం దాటిన నేపథ్యంలో ‘రెండున్నరేళ్ల’ అధికార భాగస్వామ్యంపై మళ్లీ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే, ఇలాంటి చర్చలు పూర్తిగా నిరాధారమని డీకే ఖరఖండిగా కొట్టిపారేశారు.

డిప్యూటీ సీఎంగా కొనసాగడానికి సంతోషంగా ఉన్నా: డీకే శివకుమార్ - Tholi Paluku