Let's talk: editor@tmv.in
డిజిటల్ సంస్కరణలతో వ్యాపార విప్లవం

డిజిటల్ సంస్కరణలతో వ్యాపార విప్లవం

Dantu Vijaya Lakshmi Prasanna
26 మార్చి, 2026

భారత్ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా మార్పు చెందుతోంది. ముఖ్యంగా డిజిటల్ పరివర్తనను ప్రధాన సాధనంగా ఉపయోగిస్తూ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలను అమలు చేస్తోంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’ను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం నియంత్రణలను సరళీకరించడం, పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ వ్యవస్థల పనితీరును సమర్థవంతం చేయడం వంటి చర్యలను తీసుకుంది.

వ్యాపారం ప్రారంభించడం నుంచి సంస్థను విస్తరించడం వరకు అవసరమైన అన్ని ప్రక్రియలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వేగవంతం చేస్తూ భారత్ తన ఆర్థిక వ్యవస్థను ఆధునిక దిశగా తీసుకెళ్తోంది. ఈ సంస్కరణల ఫలితంగా దేశంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతూ, కొత్త కంపెనీలు, స్టార్టప్‌ల స్థాపన వేగవంతమవుతోంది.

డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయడం ద్వారా భారత్ వ్యాపారాల కోసం సులభమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన వాతావరణాన్ని రూపొందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణలను ఒకే డిజిటల్ వేదికలో అనుసంధానం చేయడం వల్ల వ్యాపారులకు అనుమతులు, లైసెన్సులు, ఇతర ప్రక్రియలు సులభంగా పూర్తి చేసే అవకాశం లభిస్తోంది.

గతంలో వ్యాపారం ప్రారంభించడానికి అనేక శాఖలను సంప్రదించాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చాలా ప్రక్రియలు ఆన్‌లైన్‌లోనే పూర్తవుతున్నాయి. దీని వల్ల సమయం, ఖర్చు రెండూ గణనీయంగా తగ్గాయి. ఈ మార్పులు దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపును అందిస్తున్నాయి.

ఎంసిఏ 21( కేంద్ర ఈ-గవర్నెన్స్ పోర్టల్)

భారత్‌లో వ్యాపార నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి ఆధునిక డిజిటల్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఎంసిఏ 21 ఒకటి. 2006 నుంచి కంపెనీలు, ఎల్ఎల్పీల నమోదు, ఫైలింగ్ సేవలను అందిస్తున్న ఈ పోర్టల్‌ను ఇటీవల ఆధునీకరించారు. ఎంసీఏ 21 వెర్షన్ 3 ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు, ఈ- స్క్రూటినీ(డిజిటల్ పరిశీలన), ఈ-అడ్జుడికేషన్ (డిజిటల్ తీర్పు ప్రక్రియ), ఈ-కన్సల్టేషన్ (ఆన్‌లైన్ సంప్రదింపు) వం టి ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే కంప్లయన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంటరాక్టివ్ డాష్‌బోర్డులు, మొబైల్ యాప్‌లు ఏపిఐ ఆధారిత డేటా షేరింగ్ వంటి సదుపాయాలు వ్యాపారులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.

గత ఐదేళ్లలో ఈ పోర్టల్ ద్వారా సుమారు 3.84 కోట్ల ఫైలింగ్‌లు జరిగాయి. ఇది డిజిటల్ కార్పొరేట్ పరిపాలనలో భారత్ సాధించిన పురోగతిని సూచిస్తుంది. డేటా భద్రతను కాపాడేందుకు ఐఎస్ఓ 27001 ప్రమాణాలను అమలు చేస్తున్నారు. ఈ ప్రమాణాలు సంస్థల సమాచార భద్రతను నిర్వహించేందుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మార్గదర్శకాలు.

అలాగే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వంటి భద్రతా చర్యలు ఉపయోగించడం ద్వారా వినియోగదారుల గుర్తింపును నిర్ధారిస్తున్నారు. ఎంసీఏ 21 పోర్టల్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు నమోదైన 3 లక్షలకుపైగా ఫిర్యాదుల్లో దాదాపు 98 శాతం విజయవంతంగా పరిష్కరించడం ఈ వ్యవస్థ సమర్థతను చూపుతోంది.

“ఎంఎస్‌ఎంఈల కోసం ‘ఉద్యమ్ నమోదు పోర్టల్

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవి. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమైన డిజిటల్ వేదికల్లో “ఉద్యమ్ నమోదు పోర్టల్” ఒకటి. ఇది పూర్తిగా పేపర్‌లెస్, స్వీయ ప్రకటన ఆధారిత వ్యవస్థగా రూపొందించబడింది. వ్యాపారులు తమ సంస్థలను సులభంగా నమోదు చేసుకునేలా రూపొందించిన ఈ పోర్టల్ సీబిడిటి, జిఎస్టిఎన్ డేటాబేస్‌లతో అనుసంధానం చేయబడింది.

దీని వల్ల డాక్యుమెంటేషన్ అవసరం తగ్గి నమోదు ప్రక్రియ వేగవంతమైంది. 2026 ఫిబ్రవరి 12 నాటికి ఈ పోర్టల్ ద్వారా 7.71 కోట్లకు పైగా ఎంఎస్‌ఎంఈ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఈ సంస్థలుఅన్నీ కలిపి దాదాపు 33.97 కోట్ల ఉద్యోగాలకు మద్దతు ఇస్తున్నాయి.

దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బిజినెస్ రిఫోరంస్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం ద్వారా నియంత్రణలను సరళీకరించడం, పారదర్శకతను పెంచడం, సేవల సరఫరాను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. 2015 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఏడు సంచికలను పూర్తి చేసింది. ఎనిమిదవ సంచిక అయిన బిజినెస్ రిఫోరంస్ యాక్షన్ ప్లాన్ 2026ను 2025 నవంబర్‌లో ప్రారంభించారు.

రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా సంస్కరణలను విస్తరించేందుకు డిస్ట్రిక్ బిజినెస్ రిఫోరంస్ యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించారు. దీనివల్ల స్థానిక స్థాయిలో వ్యాపారాలకు అవసరమైన అనుమతులు, సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో విశేష ప్రగతి సాధించాయి. ఉదాహరణకు కేరళలో వ్యాపార నమోదు ప్రక్రియను సరళీకరించడం, భూ, పన్ను వ్యవస్థలను డిజిటలైజ్ చేయడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే పర్యావరణ అనుమతులను వేగవంతం చేసి పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.

సింగిల్ విండో విధానం

ఉత్తరప్రదేశ్ కూడా ఈ కార్యక్రమంలో గణనీయమైన పురోగతి సాధించింది. వ్యాపార నమోదు ప్రక్రియను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. కార్మిక నియమావళి సంబంధిత కాంప్లయన్స్ భారాన్ని 40 శాతం వరకు తగ్గించారు. భూ లావాదేవీల ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించారు.

తమిళనాడులో సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టి పరిశ్రమలకు అవసరమైన అనుమతులను డిజిటల్ రూపంలో అందిస్తున్నారు. భూ సంస్కరణలు, పర్యావరణ పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేసి పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కూడా వ్యాపార సంస్కరణల అమలులో ముందంజలో ఉంది. సింగిల్ విండో ఇండస్ట్రియల్ క్లియరెన్సులు, ఆన్‌లైన్ భూ నమోదు, డిజిటల్ పర్యావరణ అనుమతులు వంటి చర్యలు తీసుకుంది. అలాగే పరిశ్రమలు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్ కన్సెంట్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (అనుమతుల నిర్వహణ-పర్యవేక్షణ డిజిటల్ వ్యవస్థ) ను విస్తరించింది.

మధ్యప్రదేశ్‌లో భూమి కేటాయింపు ప్రక్రియను సరళీకరించి పరిశ్రమలకు తక్కువ ధరల్లో సిద్ధంగా ఉన్న మౌలిక వసతులను అందిస్తున్నారు. ఈ చర్యలు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

“ఎస్‌పీఐసీ ప్లస్ (SPICe+) సమగ్ర ఆన్‌లైన్ ఫారమ్”

కంపెనీ స్థాపన ప్రక్రియను వేగవంతం చేయడానికి “ఎస్‌పీఐసీ ప్లస్ (SPICe+) ఫారమ్” అనే సమగ్ర వెబ్ ఫారమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫారమ్ ద్వారా ఒకే దశలో పలు సేవలను పొందే అవకాశం ఉంది. కంపెనీ నమోదు, డీఐఎన్ కేటాయింపు, పాన్, టాన్ జారీ, జీఎస్టీ నమోదు, ఈపిఎఫ్ఓ, ఈఎస్ఐసి నమోదు, బ్యాంక్ ఖాతా ప్రారంభం వంటి పది ముఖ్యమైన ప్రక్రియలను ఒకే వేదికలో పూర్తి చేయవచ్చు. దీంతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సమయం గణనీయంగా తగ్గింది.

అనుమతులు, లైసెన్సులను సులభతరం చేయడానికి ప్రభుత్వం నేషనల్ సింగల్ విండో సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇది వ్యాపార అవసరాలకు అనుగుణంగా అవసరమైన అనుమతులను గుర్తించి దరఖాస్తు చేసుకునే డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో 32 కేంద్ర శాఖలు, 32 రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానమై ఉన్నాయి. ఇప్పటివరకు 698 కేంద్ర అనుమతులు, 7,435 రాష్ట్ర అనుమతులు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటివరకు 8.29 లక్షలకుపైగా అనుమతులు జారీ అయ్యాయి.

పర్యావరణ అనుమతుల కోసం పరివేష్ 3.0 అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించారు. ఇది పర్యావరణ అనుమతులు, ఆమోదానంతర పర్యవేక్షణ వంటి ప్రక్రియలను వేగవంతం చేస్తుంది. అలాగే ఈ- గ్రామ స్వరాజ్ పోర్టల్ గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడుతోంది. గ్రామాల జనాభా, ఆర్థిక వనరులు, ఆస్తులు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఒకే వేదికలో అందించడం ద్వారా స్థానిక పాలనలో పారదర్శకత పెరుగుతోంది.

పన్నులు, వాణిజ్య ప్రక్రియలను సులభతరం చేయడంలో కూడా డిజిటల్ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జీఎస్టీ అమలు భారతదేశంలో జరిగిన అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణగా భావించబడుతుంది. వివిధ పన్నులను ఒకే వ్యవస్థలో విలీనం చేసి దేశవ్యాప్తంగా సమగ్ర పన్ను వ్యవస్థను రూపొందించారు. జీఎస్టీ నెట్‌వర్క్ అనే డిజిటల్ వేదిక ద్వారా ఒక కోటి పైగా పన్ను చెల్లింపుదారులు తమ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. 2026 జనవరి నాటికి ఈ పోర్టల్ ద్వారా రూ.102.91 లక్షల కోట్ల చెల్లింపులు ప్రాసెస్ అయ్యాయి.

ఈ-వే బిల్ వ్యవస్థ

ఈ-వే బిల్ వ్యవస్థ సరుకు రవాణా ప్రక్రియలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. గతంలో ప్రతి రాష్ట్రంలో వేర్వేరు అనుమతులు అవసరమయ్యేవి. ఇప్పుడు ఒకే ఎలక్ట్రానిక్ పత్రంతో దేశవ్యాప్తంగా సరుకులను తరలించవచ్చు. దీంతో సరిహద్దు చెక్‌పోస్టులు తొలగి రవాణా సమయం గణనీయంగా తగ్గింది. 2025లో ఈ వ్యవస్థ వినియోగం 21 శాతం పెరగడం దేశంలో వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయని సూచిస్తుంది.

అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో ఐస్‌గేట్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కస్టమ్స్ శాఖ, వ్యాపార సమాజం మధ్య అన్ని డిజిటల్ లావాదేవీలకు కేంద్ర వేదికగా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ ఫైలింగ్, డ్యూటీ చెల్లింపులు, రిఫండ్ ప్రక్రియలు వంటి సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో అందిస్తుంది. అలాగే “ఈ-సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ (eCoO) 2.0 వ్యవస్థ ఎగుమతిదారులకు సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ జారీ ప్రక్రియను సులభతరం చేసింది.

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఆర్థిక ప్రవాహాన్ని పెంచేందుకు ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్(TReDS)ను ప్రారంభించారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎంఎస్ఎంఈ లు తమ బకాయిలను ఫైనాన్సియర్‌ల వద్ద డిస్కౌంట్ చేసుకుని త్వరగా నిధులు పొందగలుగుతాయి. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల లావాదేవీలను “ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా నిర్వహించడం తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.

లాజిస్టిక్స్ రంగంలో కూడా డిజిటల్ సంస్కరణలు వేగంగా అమలు అవుతున్నాయి. “ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా మౌలిక వసతుల ప్రణాళికను సమన్వయం చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో 57 కేంద్ర మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నాయి. 2026 ఫిబ్రవరి నాటికి రూ.16.10 లక్షల కోట్ల విలువైన 352 ప్రాజెక్టులను పరిశీలించగా, వాటిలో 201 ప్రాజెక్టులకు అనుమతి లభించింది.

నేషనల్ లాజిస్టిక్స్ పోర్టల్ ఎగుమతిదారులు, దిగుమతిదారులకు సమగ్ర లాజిస్టిక్స్ సేవలను అందిస్తుంది. అలాగే లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ 2.0 ద్వారా కంటైనర్లు, ట్రక్కులు, రైళ్ల ద్వారా సరుకు రవాణాను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. ఇది సరఫరా గొలుసులో పారదర్శకతను పెంచి వ్యయాలను తగ్గించడంలో సహాయపడుతోంది.

డిజిటల్ మార్కెట్ వేదికల అభివృద్ధి కూడా వ్యాపార వాతావరణాన్ని బలోపేతం చేస్తోంది. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (GeM) ప్రభుత్వ కొనుగోళ్లను పూర్తిగా డిజిటల్ చేసింది. 2026 ఫిబ్రవరి వరకు ఈ వేదికలో రూ.4 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లు నమోదయ్యాయి. అలాగే ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు సమాన అవకాశాలు కల్పిస్తూ డిజిటల్ వాణిజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం ఇది 600కు పైగా నగరాల్లో పనిచేస్తోంది.

యూపీఐ

భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలోనే ప్రత్యేకమైన మోడల్‌గా గుర్తింపు పొందుతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) ఈ వ్యవస్థలో అత్యంత విజయవంతమైన ఉదాహరణ. మొబైల్ ఫోన్ ద్వారా తక్షణ చెల్లింపులు చేసే ఈ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది. జనవరి 2026లో మాత్రమే 21.7 బిలియన్ లావాదేవీలు జరిగాయి.

యూపీఐ ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్ వంటి ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంది. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు సులభతరం కావడంతో పాటు భారత ఫిన్‌టెక్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది.

ఇక ఈ-కేవైసీ ద్వారా వినియోగదారులు ఒకసారి మాత్రమే కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తే అన్ని ఆర్థిక సంస్థల్లో అదే సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏంటీటీ లాకర్ అనే డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్ సంస్థలకు సురక్షితంగా డాక్యుమెంట్లను నిల్వ చేసి పంచుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే ఏపిఐ సేతు ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రభుత్వ డేటా, సేవలను డెవలపర్‌లు సులభంగా ఉపయోగించుకునేలా చేశారు.

మొత్తం మీద చూస్తే, డిజిటల్ సంస్కరణల ద్వారా భారత్ వ్యాపార వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. నమోదు నుంచి పన్నులు, వాణిజ్యం నుంచి లాజిస్టిక్స్ వరకు అన్ని రంగాల్లో డిజిటల్ పరివర్తన చోటుచేసుకుంది. దీని వల్ల వ్యాపారాలకు వేగం, పారదర్శకత, విశ్వసనీయత పెరిగింది. బలమైన డిజిటల్ మౌలిక వసతులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సంస్కరణలతో భారత్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన వ్యాపార గమ్యస్థానాల్లో ఒకటిగా ఎదుగుతోంది. భవిష్యత్తులో కూడా డిజిటల్ పరివర్తనను మరింత బలోపేతం చేస్తూ పరిశ్రమల అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించే దిశగా భారత్ ముందుకు సాగుతోంది.

డిజిటల్ సంస్కరణలతో వ్యాపార విప్లవం - Tholi Paluku