
డిజిటల్ విద్య ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదు: సీఎం ఒమర్ అబ్దుల్లా
డిజిటల్ లెర్నింగ్ ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయడానికి కాదని, తరగతి బోధనకు తోడ్పడుతూ విద్యలో ఉన్న లోటుపాట్లను పూడ్చడానికే అని జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. గురువారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ-పాఠశాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ-పాఠశాల ఛానల్ యూనియన్ టెర్రిటరీ వ్యాప్తంగా ఇంటి నుంచే చదువుకునే విద్యార్థుల కోసం డీటిహెచ్ ఛానల్ నంబర్ 53లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అదే కార్యక్రమంలో సమగ్ర శిక్ష పథకం కింద నిర్మించిన కొత్త హాస్టల్ భవనాలు, ఇతర అభివృద్ధి పనులను కూడా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇది డిజిటల్ విద్యా వనరుల విస్తరణకు తొలి అడుగు మాత్రమే. ప్రతి తరగతికి ప్రత్యేక ఛానల్ ఉండాలన్నదే మా దీర్ఘకాలిక లక్ష్యం. దశలవారీగా ఈ ఛానళ్లను విస్తరిస్తాం అని తెలిపారు. ఈ-క్లాస్‌రూములు, డిజిటల్ ఛానళ్ల ప్రవేశాన్ని ఉపాధ్యాయుల పాత్రను తగ్గించే ప్రయత్నంగా అర్థం చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. కనెక్టివిటీ ఉన్నా లేకపోయినా ఉపాధ్యాయులను భర్తీ చేయడం అసాధ్యం. ఉపాధ్యాయుడు–విద్యార్థి మధ్య ఉన్న సంబంధాన్ని ఏ పరికరం లేదా సాంకేతికత భర్తీ చేయలేదు. అలా చేయాలన్న ఉద్దేశం మాకు లేదని అన్నారు.
మంచి ఉపాధ్యాయుల ప్రభావాన్ని వివరిస్తూ, ఒక వ్యక్తిగత అనుభవాన్ని కూడా సీఎం పంచుకున్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు బలహీనమైన విద్యార్థిని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలడని ఆయన చెప్పారు. నాకు చిన్నప్పట్లో సైన్స్ మీద ఆసక్తి ఉండేది కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో నేను ఫెయిల్ అవుతానని నా తల్లిదండ్రులు అనుకున్నారు. శ్రీనగర్‌లో సత్ లాల్ రజ్దాన్ అనే ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన నా తండ్రికీ బోధించారు. ‘ఆయన బల్లకు బోధించినా అది కూడా పాస్ అవుతుంది’ అనే పేరు ఉండేదని అన్నారు. నా తండ్రి ముఖ్యమంత్రి కావడంతో ఇంటికి ట్యూషన్ చెప్పేందుకు రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ రజ్దాన్ సాహెబ్ మాత్రం ‘నేనే చెప్తాను, కానీ నువ్వే నా ఇంటికి రావాలి’ అన్నారు. చలి, ఎండ తేడా లేకుండా నేను జవహర్‌నగర్‌లోని ఆయన క్వార్టర్స్‌కు వెళ్లి ట్యూషన్ చెప్పించుకున్నా. ఆయన బోధనలోనే నేను సైన్స్‌లో నా జీవితంలోనే అత్యధిక మార్కులు సాధించాను అని ఒమర్ అబ్దుల్లా వివరించారు.
ఈ-పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యాశాఖను, ఇతర భాగస్వాములను సీఎం అభినందించారు. ఇది సరిగ్గా ఉపయోగించుకుంటే ఇక్కడి పిల్లల జీవితాలను మార్చగలదని ఆయన అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్ తీసుకుని పాఠ్యాంశాలు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని సూచించారు. జమ్మూ–కాశ్మీర్‌లోని 20 జిల్లాల్లో 14 జిల్లాలను ఇప్పటికే విద్యా అక్షరాస్యత కలిగిన జిల్లాలుగా తీర్చిదిద్దామని, మిగిలినవి దూరప్రాంతాల్లో ఉన్నాయని సీఎం తెలిపారు. ఈ-పాఠశాల ఛానల్ ఆ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మొబైల్ ఫోన్లు, స్క్రీన్ల వినియోగాన్ని సాంకేతికతను విద్య, మానసిక వ్యాయామం, అభ్యాసానికి సానుకూలంగా వినియోగించాలి. కానీ గేమింగ్ కోసం అతిగా వాడటం మంచిది కాదని హెచ్చరించారు. పాఠ్యపుస్తకాలతో పాటు పుస్తకాలు, మ్యాగజైన్లు, వార్తాపత్రికలు చదవాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఆ విద్యార్థులకు సూపర్ న్యూమరరీ సీట్లు
వైద్య కళాశాల మూసివేత వల్ల ప్రభావితమైన విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అదనపు సీట్లు (సూపర్‌న్యూమరరీ సీట్లు) సృష్టించి, వారిని ఇతర వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేస్తామని ఆయన తెలిపారు. శ్రీ మాతా వైష్ణో దేవి మెడికల్ కాలేజ్‌లో ప్రమాణాలు పాటించకపోతే బాధ్యతను నిర్ధారించాల్సిందేనని సీఎం అన్నారు. (సూపర్‌న్యూమరరీ సీట్లు – అధికారికంగా అనుమతించిన సీట్లకు అదనంగా సృష్టించే సీట్లు.) ఆరోగ్య మంత్రి నా పక్కనే ఉన్నారు. నిన్న సాంబాలో కూడా ఈ విషయంపై విస్తృతంగా చర్చించాం. ఈ విద్యార్థులు చట్టబద్ధంగా నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వారికి ప్రతిభ ఉంది. వారిని సర్దుబాటు చేయడం మా చట్టబద్ధమైన బాధ్యత అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. విద్యార్థుల నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న కళాశాలల్లో అదనపు సీట్లు సృష్టించి వారికి ప్రవేశం కల్పిస్తామని, తద్వారా వారి చదువు దెబ్బతినదని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు 50 సీట్లలో 40 సీట్లు ముస్లిం విద్యార్థులు పొందారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ కళాశాల సీట్లు క్రమంగా 400–500కి పెరిగి ఉంటే, భవిష్యత్తులో 250–300 మంది జమ్మూ విద్యార్థులు ఇక్కడ చదివే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ విద్యార్థులు ఎక్కడికి వెళ్తారు? అని ప్రశ్నించారు.
బీజేపీతో పాటు జమ్మూలోని ఇతర వర్గాలపై పరోక్షంగా విమర్శలు చేస్తూ దేశవ్యాప్తంగా వైద్య కళాశాల సీటు కోసం విద్యార్థులు ఎంతగా కష్టపడతారో అందరికీ తెలుసు. పూర్తిగా నిర్మించిన ఒక మెడికల్ కాలేజ్‌ను ఆందోళనల కారణంగా మూసివేసిన ఏకైక ప్రాంతం మనదే కావచ్చు అని వ్యాఖ్యానించారు. ఇతర కళాశాలలపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన తనిఖీలపై ప్రశ్నలకు స్పందిస్తూ తనిఖీలు ఎవరు చేశారు? కళాశాలకు అనుమతులు ఎలా లభించాయి? మెడికల్ కాలేజ్ నిర్మించిన తర్వాత కూడా తనిఖీల్లో ఎలా విఫలమైంది? యూనివర్సిటీని పై స్థాయి నుంచి కింద స్థాయి వరకూ ప్రశ్నించాలని అన్నారు. యూనివర్సిటీకి అధిపతి ఎవరు? చాన్సలర్ ఎవరు? వారినీ ప్రశ్నించాలి. నన్నొక్కడినే ప్రశ్నించకుండా వారినీ అడగండి” అని చెప్పారు.
