Let's talk: editor@tmv.in
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల చరిత్రలో కొత్త అధ్యాయం

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల చరిత్రలో కొత్త అధ్యాయం

Panthagani Anusha
3 నవంబర్, 2025

ప్రపంచ టెక్ పరిశ్రమ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కీలక సమస్యకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లక్నో పరిశోధకులు పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇంటర్నెట్ యుగం ప్రారంభమైనప్పటి నుంచి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తమ లాభదాయకతను కొనసాగించడమా లేక వినియోగదారుల గోప్యతను రక్షించడమా అనే ఇరకాటంలో ఉన్నాయి. ప్రస్తుతం యూరప్‌లోని జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ భారతదేశంలో నెలకొన్న డిజిటల్ డేటా చట్టాల నేపథ్యంలో ఈ సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఈ సందిగ్ధతకు తెరదించుతూ, ఐఐఎం లక్నో పరిశోధకులు "పే-ఆర్-కన్సెంట్" అనే వినూత్న వ్యాపార నమూనాను రూపొందించారు.వీరు రూపొందించిన "పే-ఆర్-కన్సెంట్" మోడల్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లాభాలు, వినియోగదారుల గోప్యతకు మధ్య సమతుల్యత రెండు ఏక కాలంలో సాధించవచ్చు అని ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్లక్నో పరిశోధకులు వెల్లడించారు.

పే-ఆర్-కన్సెంట్ మోడల్ ప్రకారం రెండు మార్గాలు ఉంటాయి. తద్వారా ప్రతి వినియోగదారుడికి తమకు ఇష్టమైన ఎంపికను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. మొదటిది యాడ్-ఫ్రీ చెల్లింపు ప్రకటనలు లేకుండా సేవలను ఉపయోగించుకోవడానికి కొంత సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించడం.రెండవది ప్రకటనల సమ్మతి అంటే ఉచితంగా సేవ పొందడానికి టార్గెటెడ్ ప్రకటనల కోసం తమ డేటాను ఉపయోగించడానికి సమ్మతి తెలపడం.

ఐఐఎం లక్నో ప్రొఫెసర్ సురేష్ కె. ఝాఖర్ ఈ అంశంపై మాట్లాడుతూ, గోప్యతను గౌరవించడం వల్ల కంపెనీ వృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టంచేశారు. ".ఈ మోడల్ ద్వారా, ప్లాట్‌ఫారమ్‌లు యూజర్ల ఇష్టాన్ని గౌరవిస్తూనే, వారు తమ బిజినెస్ నడవడానికి కావాల్సిన ఆదాయాన్ని పొందగలుగుతారు అని ఆయన పేర్కొన్నారు.

ఎప్పుడు సబ్‌స్క్రిప్షన్ బెటర్?

పరిశోధన బృందం రూపొందించిన మోడల్ ప్రకారం యూజర్‌లకు గోప్యతా ఆందోళనలు అధికంగా ఉన్నట్లయితే, కేవలం ప్రకటనల ఆధారిత మోడల్స్ కంటే సబ్‌స్క్రిప్షన్ మోడల్స్ మెరుగైన ఫలితాలను ఇస్తాయి. ఆందోళన తక్కువగా ఉన్నప్పుడు, ప్రకటనల మోడల్స్ ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి.

అందుకే పరిశోధకులు తక్కువ ధర గల యాడ్-ఫ్రీ ప్లాన్‌లను, అడ్డంకి లేని ప్రకటనలను కలిపి అందించడం ద్వారా లాభాన్ని, యూజర్ సంతృప్తిని సమతుల్యం చేయవచ్చని సూచించారు. ఈ విధానం వల్ల గోప్యతను కోరుకునేవారు చెల్లిస్తారు, మిగతావారు ప్రకటనల ద్వారా ఆదాయానికి తోడ్పడతారు.

అన్ని డిజిటల్ సేవలకు వర్తిస్తుంది

ఈ అధ్యయన ఫలితాలు వీడియో, మ్యూజిక్, పోడ్‌కాస్ట్‌లు, డిజిటల్ వార్తా సేవలను అందించే అన్ని ప్లాట్‌ఫారమ్‌లకు వర్తిస్తాయి. మారుతున్న యూజర్ల అంచనాలకు కొత్త డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా తమ ప్రకటనల నమూనాలను పున సమీక్షించుకోవాలని భావిస్తున్న కంపెనీలకు ఈ పరిశోధన ఒక కీలక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది