
డిజిటల్ న్యాయదిశగా వినియోగదారుల శక్తి
ప్రతి రోజూ మన జీవితంలో కొనుగోళ్లు సహజమైన భాగమయ్యాయి. కిరాణా సరుకుల నుంచి ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాల వరకు, ఆన్‌లైన్ సేవల నుంచి వైద్య సేవల వరకు, వినియోగదారుడిగా ప్రతి వ్యక్తి మార్కెట్ వ్యవస్థతో ముడిపడి ఉన్నాడు. ఈ సందర్భంలో వినియోగదారుల హక్కులు, రక్షణ, న్యాయం అనే అంశాలు మరింత కీలకంగా మారాయి. ఈ భావనను బలంగా గుర్తుచేస్తూ భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటారు.
1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిన చారిత్రక రోజైన డిసెంబర్ 24ను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన పెంపొందించడం, మోసపూరిత వ్యాపార పద్ధతులపై ప్రజలను చైతన్యవంతులుగా చేయడం, బాధ్యతాయుత మార్కెట్ వ్యవస్థను నిర్మించడమే ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం.
వినియోగదారుల హక్కులు - ప్రజాస్వామ్య మార్కెట్‌కు పునాది
వినియోగదారుడు బలహీనుడన్న భావన ఒకప్పుడు విస్తృతంగా ఉండేది. కానీ వినియోగదారుల పరిరక్షణ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారింది. భారతదేశంలో వినియోగదారులకు కల్పించిన ముఖ్యమైన హక్కులు కొన్ని ఉన్నాయి. అవే రక్షణ పొందే హక్కు, సమాచారం తెలుసుకునే హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, తమ సమస్యలను వినిపించుకునే హక్కు, నష్టపరిహారం పొందే హక్కు, వినియోగదారుల అవగాహన హక్కు లాంటివి మార్కెట్ వ్యవస్థను సమతుల్యంగా ఉంచే మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి.
ఈ హక్కులు కేవలం చట్టపరమైన పదాలు మాత్రమే కాకుండా, వినియోగదారుడు గౌరవంతో జీవించేందుకు అవసరమైన సాధనాలుగా మారాయి. సరైన సమాచారం లేకుండా చేసిన కొనుగోళ్లు, నాణ్యత లేని ఉత్పత్తులు, తప్పుడు ప్రకటనల వల్ల జరిగే నష్టాలను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
2025 థీమ్ - డిజిటల్ న్యాయం, వేగవంతమైన పరిష్కారం
జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 థీమ్, “డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా సమర్థవంతమైన, వేగవంతమైన కేసుల పరిష్కారం”
ఈ థీమ్ భారతదేశం చేపట్టిన డిజిటల్ పాలన దిశలో వినియోగదారుల న్యాయవ్యవస్థను తీసుకెళ్లే స్పష్టమైన సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలస్యం, ఖర్చు, భౌతిక హాజరు వంటి అడ్డంకులను తొలగించి, సాంకేతికత ఆధారంగా న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 - ఆధునిక సంస్కరణ
వేగంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019ను ప్రవేశపెట్టారు. ఇది 1986 చట్టాన్ని భర్తీ చేస్తూ, 2020 జూలై 20న అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేయడమే కాకుండా, వ్యాపార సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచించారు.
ఈ చట్టం ప్రకారం వినియోగదారుల వివాదాల పరిష్కారానికి మూడు స్థాయిల వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లు. కేసుల విలువ ఆధారంగా వీటికి అధికార పరిధి నిర్ధారించారు. ఈ వ్యవస్థ వల్ల సాధారణ ప్రజలకు న్యాయం మరింత సులభంగా అందుబాటులోకి వచ్చింది.
కేసుల పరిష్కారంలో వేగం - 2025లో కొత్త దిశ
2025 జూలై నెలలో పది రాష్ట్రాలు, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమీషన్ 100 శాతం కంటే ఎక్కువ కేసుల పరిష్కార రేటును నమోదు చేయడం గమనార్హం. అంటే కొత్తగా వచ్చిన కేసుల కంటే ఎక్కువ కేసులు పరిష్కరించబడ్డాయి. ఇది న్యాయవ్యవస్థలో సామర్థ్యం పెరిగిందనడానికి నిదర్శనం.
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అధికారం
వినియోగదారుల ప్రయోజనాలను సమష్టిగా కాపాడేందుకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అధికారంను ఏర్పాటు చేశారు. తప్పుడు ప్రకటనలు, అన్యాయ వ్యాపార పద్ధతులు, మోసపూరిత ప్రచారాలపై చర్యలు తీసుకోవడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. తప్పుడు ప్రకటనలు ఇచ్చే తయారీదారులు, సెలబ్రిటీ ఎండార్సర్లపై కూడా చర్యలు తీసుకునే అధికారాలు సిసిపిఏ కు ఉన్నాయి. ఇది వినియోగదారుల హక్కుల రక్షణలో ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు.
వినియోగదారుల సంక్షేమ నిధి - ఉద్యమానికి బలం
వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు, పరిశోధనలు, శిక్షణలు నిర్వహించేందుకు వినియోగదారుల సంక్షేమ నిధి కీలక పాత్ర పోషిస్తోంది. 2024,25 ఆర్థిక సంవత్సరంలో రూ.38.68 కోట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేయడం ద్వారా వినియోగదారుల ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు.
ఈ -జాగృతి - వినియోగదారుల న్యాయంలో డిజిటల్ విప్లవం
2025 జనవరి 1న ప్రారంభమైన ఈ -జాగృతి వేదిక భారతదేశంలో వినియోగదారుల న్యాయవ్యవస్థను పూర్తిగా డిజిటల్‌గా మార్చింది. ఫిర్యాదు నమోదు నుంచి వర్చువల్ విచారణల వరకు అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చాయి. ఈ వేదిక బహుభాషా మద్దతు, వాయిస్-టు-టెక్స్ట్, చాట్‌బాట్ సహాయం వంటి సౌకర్యాలతో వృద్ధులు, వికలాంగులకు కూడా అనుకూలంగా రూపొందించబడింది. 2025 నవంబర్ నాటికి లక్షల సంఖ్యలో కేసులు దాఖలు కావడం, దాదాపు అంతే సంఖ్యలో కేసులు పరిష్కారం కావడం ఈ వ్యవస్థ విజయాన్ని చాటుతోంది. ఈ - జాగృతి ప్లాట్ ఫామ్ పనితీరులో మంచి ఫలితాలు రాబట్టిందని త్రిపుర వినియోగదారుడికి న్యాయం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఎనిమిదేళ్లుగా సమస్యలతో బాధపడుతున్న ఒక వినియోగదారుడు ఈ- జాగృతి ద్వారా ఐదు నెలల్లోనే న్యాయం పొందడం ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని చాటుతుంది. రిఫండ్‌తో పాటు నష్టపరిహారం, మానసిక వేదనకు పరిహారం లభించడం వినియోగదారుల హక్కులు ఎంత బలంగా అమలవుతున్నాయో చూపిస్తుంది.
జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ 2.0
ఏఐ ఆధారిత ఎన్సిఎచ్ 2.0 వినియోగదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తోంది. 17 భాషల్లో సేవలు అందిస్తూ, వాట్సాప్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. 2025లో కోట్ల రూపాయల రీఫండ్‌లు సాధ్యమవడం ఈ వ్యవస్థపై ప్రజలకు పెరిగిన విశ్వాసాన్ని సూచిస్తోంది.
ప్రమాణాలు, నాణ్యత - బిఐఎస్ నేషనల్ టెస్ట్ హౌస్
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, నేషనల్ టెస్ట్ హౌస్ వంటి సంస్థలు ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. హాల్‌మార్కింగ్, పరీక్షలు, ప్రమాణాల అమలు ద్వారా వినియోగదారులకు భద్రతను కల్పిస్తున్నాయి.
2025లో చేసిన లీగల్ మెట్రాలజీ నిబంధనల సవరణలు ధరల పారదర్శకతను పెంచాయి. దిగుమతి వస్తువులపై దేశం పేరు చూపించడం, ప్యాకేజింగ్ నిబంధనల్లో స్పష్టత వినియోగదారుడికి సమాచారం ఆధారిత నిర్ణయాలను తీసుకునే అవకాశం కల్పిస్తోంది.
జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది వినియోగదారుల హక్కులపై ఒక సామూహిక ఆలోచన. డిజిటల్ న్యాయవ్యవస్థ, బలమైన చట్టాలు, చైతన్యవంతమైన వినియోగదారులు కలిసి ఒక న్యాయమైన, పారదర్శకమైన మార్కెట్‌ను నిర్మిస్తున్నాయి. తెలిసిన వినియోగదారుడే శక్తివంతమైన వినియోగదారుడు అన్న సత్యాన్ని ఈ దినోత్సవం మరోసారి గుర్తు చేస్తోంది.
